అంగన్‌వాడీ ఉద్యమాలపై నిర్బంధం తగదు
పాడేరు: అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని విజయవాడలో శాంతియుతంగా నిర్వహించిన మహాధర్నా కార్యక్రమాన్ని పోలీసులతో భగ్నం చేయాలని కూటమి ప్రభుత్వం చూడడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సమ్మె సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైన వేతనం పెంపు ఊసే లేదని చెప్పారు. అందుకే చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లిన అంగన్‌వాడీ యూనియన్ నాయకులను ఐసీడీఎస్ పీడీ బెదిరించడం సరికాదన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు. పాడేరు ఐసీడీఎస్ పీడీపై మహిళ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలపై పీడీ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఆ విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ పీడీ తన వైఖరి మార్చుకోకపోతే ప్రాజెక్టు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాగ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు కొండమ్మ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
పాడేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన
Comments
Please login to add a commentAdd a comment