
ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
పాడేరు : జిల్లాలో చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తడికవాగు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఒక కమాండర్‌తో పాటు సభ్యుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ అమిత్‌బర్దర్ శనివారం విలేకరులకు తెలిపారు. పోలీసులను హతమార్చడానికి పేలుడు పదార్థాలు ఏ విధంగా అమర్చాలి అనే విషయంపై తడికవాగు శివారు అటవీప్రాంతంలో సమావేశమైనట్టు అందిన ముందస్తు సమాచారంతో ఈనెల 28న కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులపై తుపాకులు, కత్తులతో దాడులతో దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. దీంతో పోలీసు బలగాలు చాకచక్యంగా ఇద్దరిని పట్టుకోగా, మిగిలిన వారు పరారైనట్టు చెప్పారు. పట్టుబడిన వారిలో శబరి కమాండర్‌గా పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా డోకుపదు గ్రామానికి చెందిన మడకం మంగా అలియాస్ మంగల్, దబ్బపాదు గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యుడు మడివి రమేష్‌లున్నారని చెప్పారు. వీరి నుంచి మారణాయుధాలు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరిపై 2015 సంవత్సరం నుంచి 2025 వరకు సుమారు 18 కేసులు నమోదైనట్టు వివరించారు. పలు హింసాత్మక ఘటనలు, నేరాల్లో పాల్గొన్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి తుపాకులు, తూటలు, వాకీటాకీలు, విప్లవ సాహిత్యం, ప్లాస్టిక్ బాక్స్‌లు, నాలుగు రంగు ప్లాస్టిక్ షీట్స్, రూ.24,900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఉంటే నేరుగా పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్) జగదీష్ అడహాల్లీ, చింతూరు సబ్ డివిజన్ సీఆరీపీఎఫ్ అధికారి టి. దుర్గారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మీడియాకు వివరాలు వెల్లడించిన
ఎస్పీ అమిత్‌బర్దర్