
సీలేరులో మొసలి హల్‌చల్
రిజర్వాయర్ వద్ద మొసలి
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు గుంటవాడ రిజర్వాయర్ ఒడ్డున గత వారం రోజులుగా ఓ మొసలి హల్‌చల్ చేస్తోంది. నీటిలో ఉండాల్సిన మొసలి ఒడ్డుకు వచ్చి రోడ్డుకు ఇరు వైపులా తిరుగుతుండడంతో ఆ దారిలో వెళ్లే వారు, ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 10గంటల సమయంలో రిజర్వాయర్ ఒడ్డున తిరుగుతూ సుమారు 12 అడుగుల పొడవున్న మొసలి కొందరి కంటపడింది. రిజర్వాయర్ ఒడ్డుకు మొసలి రావడంతో అక్కడి ఉద్యోగులు జెన్‌కో ఏఈఈ సురేష్, విజిలెన్స్ ఉద్యోగి కోటేశ్వరరావుకు తెలియజేశారు. వెంటనే వారు సంబంధిత సిబ్బందితో వెళ్లి దానిని సురక్షితంగా రిజర్వాయర్‌లోకి పంపించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఒడిశా భూ భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎనిమిది నెలల కిందట ఓ మొసలి రిజర్వాయర్ నుంచి బయటకు వచ్చి మృతి చెందింది. దాన్ని చిత్రకొండ అటవీశాఖ అధికారులు అప్పట్లో ఖననం చేశారు.