
తాండవ రిజర్వాయరులో తగ్గుతున్న నీటి నిల్వలు
● ప్రస్తుతం 364.8 అడుగులకు చేరిన నీటి నిల్వలు ● గేట్ల లీకేజీ ద్వారా వృథా అవుతున్న నీరు
నాతవరం : ఉమ్మడి జిల్లాలోనే ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతుంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేసి డిసెంబరు నెలలో ప్రాజెక్టు నుంచి నీటిని నిలుపుదల చేశారు. తాండవ రిజర్వాయరు గేట్లు దించే సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 369.6 అడుగులు నీరు ఉండేది. ప్రాజెక్టు ప్రధాన గేట్ల ద్వారా నిత్యం నీరు లీకేజీతో పోవడంతో రోజు రోజుకు నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతోంది. తాండవలో మంగళవారం సాయంత్రానికి నీటి మట్టం 364.8 అడుగులకు చేరింది. ఆయకట్టుకు నీటిని నిలుపుదల చేసిన దగ్గర్నుంచి నేటి వరకు గేట్ల లీకేజీ ద్వారా సుమారుగా అయిదు అడుగుల నీరు వృధాగా పోయింది, తాండవ రిజర్వాయరు ప్రమాద స్థాయి నీటి మట్టం 380.0అడుగులు కాగా డేడ్ స్టోరేజీ నీటి మట్టం (అంటే బయటకు ప్రవహించదు) 345.0 అడుగులుగా అధికారులు పరిగణిస్తారు. తాండవ రిజర్వాయరు గేట్ల మరమ్మతుల ద్వారా లీకేజీలను ఆరికట్టేందుకు ప్రభుత్వం రూ.19.70 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో గత నెలలో ప్రధాన గేట్ల మరమ్మతు పనులను ఇరిగేషన్ ఈఈ బాలసూర్యం తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మేజరు ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు కావడంతో అనుభవం ఉన్న మెకానికల్ ఇంజినీరింగ్ అధికారులతో పనులు చేస్తున్నారు. ఆ పనులు సకాలంలో పూర్తి అయితే నిత్యం వృథాగా పోతున్న ప్రాజెక్టులో నీటిని అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విషయంపై ప్రాజెక్టు డీఈ ఆనురాధ మాట్లాడుతూ ప్రస్తుతం తాండవ గేట్ల మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు. లీకేజీ నీరు ప్రవహం బాగా తగ్గిందన్నారు. గేట్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు మరికొంత మెటీరియల్ రావలసి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి లీకేజీలు లేకుండా చేస్తామన్నారు.
తాండవ ప్రాజెక్టులో తగ్గిన నీటి నిల్వలు