
బడిఈడు పిల్లలనుపాఠశాలల్లో చేర్చాలి
జి.మాడుగుల: ఐదేళ్లు నిండిన బడిఈడు పిల్లలను ఉపాధ్యాయులు గుర్తించి పాఠశాలలో చేర్చుకోవాలని ఏఎస్సార్ జిల్లా విద్యాశాఖాధికారి బి.బ్రహ్మాజీరావు ఆదేశించారు. ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా జి.మాడుగుల మండలం గాంధీనగరంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల, వైబి గొందూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, హాజరు పట్టీలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ గ్రామాల్లో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను గుర్తించి పాఠశాలలో ప్రవేశాల కల్పించే విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సిహెచ్.బాబూరావుపడాల్, తదితరులు పాల్గొన్నారు.