
జీడిపిక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
గంగవరం: వన్‌ధన్ వికాస కేంద్రాల ఆధ్వర్యంలో జీడిపక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా జీడిపిక్కలు కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. మండల కేంద్రమైన గంగవరంలో ఆయన శుక్రవారం పర్యటించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న జీడిపిక్కల కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని , జీడి పిక్కలు భద్ర పరిచేందుకు వీలుగా ఉన్న గోదామును ఆయన పరిశీలించారు. మండల కేంద్రమైన గంగవరంలో డ్వాక్రా సంఘాలు వన్‌ధన్ వికాస కేంద్రాలు ద్వారా జీడిపిక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక డ్వాక్రా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. రైతులు పండించిన జీడిపిక్కలను దళారీ వ్యాపారులకు అమ్మి మోసపోతున్నారని, దీనిని నివారించేందుకు వన్‌ధన్ వికాస కేంద్రాలు డ్వాక్రా సంఘాల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేసి ఆ లబ్ధిని మీరే పొందవచ్చని వారికి సూచించారు. గంగవరంలో ఏర్పాటు చేయనున్న జీడిపిక్కల కొనుగోలు కేంద్రం ద్వారా త్వరలోనే పిక్కలు కొనుగోలు చేసేందుకు సిద్ధపడాలన్నారు. ఐటీడీఏ ద్వారా వన్‌ధన్ వికాస కేంద్రాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జీడిమామిడి పిక్కలకు మంచి గిట్టుబాటు ధరను కల్పించి గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ఐటిడిఎ చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో లక్ష్మణరావు, వెలుగు డీపీఎం పరమేష్, ఏపీఎం షణ్ముఖరావు, ఆర్‌ఐ లక్ష్మణరావు, వ్యవసాయాధికారి విశ్వనాఽథ్, ఉపాధి ఏపీఓ ప్రకాశ్, వీడీవీకే నాయకులు చిలకమ్మ, పద్మ, మార్కెటింగ్ టీమ్ ఉదయ్, శ్రీనివాస్, సీసీలు పాల్గొన్నారు.