
అంబరాన్ని తాకిన బడ్డు సంబరం
పాత పాడేరులో విభిన్నంగా ఇటుకల పండగ
సాక్షి,పాడేరు: పాతపాడేరులో నిర్వహించిన బడ్డు సంబరం అంబరాన్ని తాకింది. ఈ ఉత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఇటుకల పండగను పాత పాడేరులో విభిన్నంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సమీప అడవుల నుంచి సేకరించిన తీగలతో తాడులా పెద్ద బడ్డును తయారు చేసి, దానికి మహిళలు పూజలు చేస్తారు. తరువాత అక్కా చెల్లెళ్లు అయిన మహిళలు ఒక వైపు, వదినా మరదళ్లు మరో వైపు ఉంటూ ఆ బడ్డును లాగుతారు. దానిని ఎవరి వైపునకు లాక్కుంటే వాళ్లే విజయం సాధించినట్టుగా భావిస్తారు. అలా ఆదివారం స్థానిక పాత పాడేరులో జరిగిన బడ్డు ఉత్సవంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా పాతపాడేరు గ్రామ నడిబొడ్డున థింసా నృత్యా లతో సందడి చేశారు. పలువురు మహిళలు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. విభిన్నమైన ఈ సంబరాన్ని తిలకించేందుకు పలు గ్రామాలు, మైదాన పాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు తరలివచ్చారు. మధ్యాహ్నం గిరిజనుల ఆరాధ్య దైవం శంకులమ్మకు, ఇతర దేవతల విగ్రహాలకు గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి థింసా నృత్యాలు,పలు వేషధారణలతో అందరూ ఊరేగింపుగా గ్రామ చావడి వద్దకు చేరుకున్నారు. గ్రామ చావడిలో సాయంత్రం సుమారు గంట పాటు పోటాపోటీగా థింసా నృత్యాలతో హోరెత్తించారు. అనంతరం గొడుగుల సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత బడ్డు తాడు లాగే సంబరం ఉత్సాహంగా జరిగింది. ఈ సంబరాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
పండగ సరదా.. వేటకు పదపద
ఆకట్టుకున్న వివిధ వేషధారణలు
థింసా నృత్యాలతో సందడి

అంబరాన్ని తాకిన బడ్డు సంబరం