
ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు
మద్దిలపాలెం(విశాఖ): విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పైడా కౌశిక్ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన ‘రాత’నాటకం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో గుంటూరి అభినయ ఆర్ట్స్ వారి ‘ఇది అతని సంతకం’ఉత్తమ ప్రదర్శనగా ఎంపికయింది. ద్వితీయ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ వారి ‘చిగురు మేఘం’, తృతీయ ప్రదర్శనగా విజయవాడ యంగ్ థియేటర్ ఆర్ట్స్ వారి ‘27వ మైలురాయి’, చతుర్థి ప్రదర్శనగా ఉక్కునగరానికి చెందిన చైతన్య కళా స్రవంతి వారి ‘అసత్యం’నాటకాలు బహుమతులు సాధించాయి. న్యాయ నిర్ణేతలుగా విశ్రాంత ఆచార్యులు బాబీవర్ధన్, ఒ.ఎ.వేణు, సత్యప్రసాద్‌లు వ్యవహరించారు. ఇది అతని సంతకం ప్రదర్శనకు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం, 27వ మైలురాయికి ఉత్తమ నటి, ఉత్తమ రచన అవార్డులు దక్కాయి. బహుమతులుగా నగదు, జ్ఞాపికలను వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన సత్యనారాయణరాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, సాంబశివరావు, జి.పవన్‌కుమార్, ఒ.నరేష్‌కుమార్, వి.ధర్మేందర్‌ల చేతుల మీదుగా అందించారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనగా
‘ఇది అతని సంతకం’