
తొలి విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీత గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ నెల 30న వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే స్వామివారి చందనోత్సవం(నిజరూప దర్శనం) అనంతరం ఆ రోజు రాత్రి తొలివిడతగా సమర్పించాల్సిన మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమకూర్చేందుకు ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆలయ బేడా మండపంలోని భాండాగారం వద్ద తొలి చందనం చెక్కను ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. అనంతరం ఆ చందనం చెక్కతో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోశ్చరణల మధ్య బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం నోటికి వస్త్రం చుట్టుకుని తొలిచందనాన్ని అరగదీశారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు చందనాన్ని అరగదీశారు. అరగదీసిన చందనాన్ని స్వామివారి మూలవిరాట్‌కి సమర్పించారు. అనంతరం 20 మంది నాల్గవ తరగతి సిబ్బంది చందనం అరగదీతలో పాల్గొన్నారు. ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్, సూపరింటెండెంట్ త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

తొలి విడత చందనం అరగదీత ప్రారంభం