నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతున్న ప్రసాద్‌రెడ్డి
నక్కపల్లి : ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబునాయుడు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పొత్తు లేనిదే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము చంద్రబాబునాయుడికి లేదన్నారు.
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న చంద్రబాబు తర్వాత పొత్తు లేకుండా ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో విఫలమైన బీజేపీతో చంద్రబాబు పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మళ్లీ 2024లో బీజేపీతో పొత్తు కోసం అమిత్‌షా, మోదీతో కాళ్ల బేరానికి దిగుతున్నారన్నారు. విభజన చట్టాలను అమలు చేయని బీజేపీతో పవన్ పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ నోరు మెదపడం లేదన్నారు.
వైఎస్సార్ హయాంలో చక్కెర కర్మాగారాలకు నిధులు మంజూరు చేసి నష్టాల ఊబిలో నుంచి గట్టెక్కిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మేడేటి శంకర్, జిల్లా కార్యదర్శి ఎం.ఎన్.చక్రవర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరావు, మండల శాఖ అధ్యక్షుడు ప్రగడ చక్రధరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment