నోట్ల కట్టలున్న వారికే టికెట్లు కట్టబెట్టారని టీడీపీ నేతల ఆగ్రహం
పార్టీని నమ్ముకొని పనిచేస్తే బాబు ద్రోహం చేశారని ఆవేదన
కండువాపై కండువా వేసి పనిచేయలేమంటున్న క్యాడర్
ప్రతి నియోజకవర్గంలో రగులుతున్న అసంతృప్తి
కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై పవన్‌పై క్యాడర్‌లో వ్యతిరేకత
రెండు కత్తులు ఒకే ఒరలో ఇమిడే ప్రసక్తే లేదంటున్న జనసేన వర్గం
సాక్షి, విశాఖపట్నం : నోట్ల కట్టలు చూపించినవారికే టికెట్ కన్ఫార్మ్ చేసిన చంద్రబాబు వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీని నమ్ముకుంటూ పనిచేస్తుంటే నోట్ల కట్టలకు సీట్లు అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోకపార్టీ జనసేనలోనూ ఇదే వైఖరి కనిపిస్తోంది. పదేళ్లు కష్టపడిన వారిని పక్కన పెట్టేసి.. కొత్తగా కండువా కప్పుకున్న వారికి టికెట్ కట్టబెట్టిన పవన్ వ్యవహారంపైనా కేడర్‌లో వ్యతిరేకత మొదలైంది. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేసుకొని కండువాపై కండువా వేసుకుంటూ ప్రచారం చేయడం తమ వల్ల కాదంటూ టీడీపీ, జనసేన నాయకులు కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఉమ్మడి విశాఖలో ప్రతి నియోజకవర్గంలోనూ ఈ అసమ్మతి కుంపటి రోజురోజుకూ రాజుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలోనూ కేడర్ మొత్తం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తీరు తూర్పారపడుతున్నారు.
జనసేనతో కోట్లకు బేరం
దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో మమేకమైన పార్టీ నేతలు డా.విల్లూరి చక్రవర్తి, నజీర్‌కి కూడా చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. పార్టీని నమ్ముకుంటూ వచ్చిన తమను మోసం చేయడం తగదని వేడుకున్నా.. వారి మాటలు వినేందుకు కూడా చంద్రబాబు, లోకేష్ ఇష్టపడలేదని సమాచారం. దీంతో దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు బేరం కుదుర్చుకున్నాడని విమర్శలు కోడై కూస్తున్నాయి.
గంటాకు సీటు అమ్మేశారు
భీమిలి నియోజకవర్గంలో ఆది నుంచి కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్న కోరాడ రాజబాబు, కర్రోతు బంగార్రాజును గతంలో మెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారి దగ్గర డబ్బులు లేవంటూ గంటా వైపు మొగ్గు చూపారు. సుమారు రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేయగలనని చంద్రబాబుకు చెప్పి.. టికెట్ ఇవ్వాలని కోరాడ కోరినా.. సరిపోవంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వర్గాలు బాబు వైఖరిపై మండిపడుతున్నాయి. భీమిలిని నాశనం చేసిన గంటాకు టికెట్ అమ్మేసుకున్నారంటూ టీడీపీ శ్రేణులే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నాయి.
ద్వితీయశ్రేణి నేతలపై నిర్లక్ష్యం
ఉత్తర నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గెలిచిన నాటినుంచి నియోజకవర్గం ముఖం చాటేసిన తర్వాత.. అక్కడి కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నేతలు పార్టీకి కాపుకాస్తూ వచ్చారు. అయితే ఇక్కడ టికెట్‌ను బీజేపీకి కేటాయించడంతో పార్టీలో ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
‘గ్లాసు’లోనూ అసమ్మతి తుపాను
ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబుతోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా పయనిస్తూ.. చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కూడా.. బాబు లక్షణాలు వంటబట్టాయి. తనని నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వారి భవిష్యత్తును గాలిలో దీపం మాదిరిగా వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు పవన్ పొత్తు వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. టికెట్ ఆశించి పార్టీకి ఏ తాడు బొంగరం లేకపోయినా అన్నీ తామై కోట్లు ఖర్చు చేసిన వారిని ఏమాత్రం పట్టించుకోలేదు.
నియోజకవర్గంలో జనసేన కోసం పాటుపడిన వారికి, టికెట్ ఆశించి పార్టీలో చేరిన వారికీ పవన్ ఝలక్ ఇచ్చారు. భీమిలిలో పంచకర్ల సందీప్‌కు టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో మోసం చేయడంపై భీమిలి జనసేన వర్గం పవన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దక్షిణంలో టికెట్ ఇస్తామన్న హామీతో గ్లాసు పట్టుకున్న కార్పొరేటర్లు కందుల నాగరాజు, సాధిక్.. పవన్‌ను నమ్ముకొని రోడ్డున పడ్డారు. ఉత్తర నియోజకవర్గంలో పసుపులేటి ఉషాకిరణ్‌కీ పవన్ వెన్నుపోటు పొడిచారు.
గాజువాక టికెట్ ఆశించి పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేసిన సుందరపు సతీష్‌ని కరివేపాకులా తీసిపారేశారు. అనకాపల్లిలో పరుచూరి భాస్కరరావు పవన్ హ్యాండిచ్చారు. పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు సీటు ఇవ్వొద్దని జనసేన నేత గెడ్డం బుజ్జి అభ్యర్థన కూడా పవన్ కల్యాణ్ పరిగణలోకి తీసుకోలేదు. ఇలా కూటమి పేరుతో టికెట్లు అమ్ముకున్నారంటూ జనసేన శ్రేణులు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment