వేతన వెతలు
ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీల ఆకలి కేకలు
నిధులు విడుదల కాలేదంటున్న అధికారులు
వ్యవసాయ సీజన్ ముగిసింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ప్రతి గ్రామంలో ఉపాధి పనుల బాట పడుతున్నారు. రోజంతా మట్టిలో స్వేదం చిందిస్తే కూలీలకు రూ.250–300లకు మించి రావడంలేదు. అయినా ఏదో ఇంటి ఖర్చులు తీరతాయి అని వెళితే గత ఏడు వారాలుగా వేతనాలు చెల్లించలేదు. దీంతో ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో అని ఉపాధి కూలీలు ఎదురు చూస్తున్నారు.
బకాయిలైనా చెల్లించండి... తిండైనా పెట్టండి
రాష్ట్రవ్యాప్తంగా నిధులకు కటకట
ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 95 శాతం పనిదినాలు కల్పించాం. మార్చి నెలలో దాదాపుగా లక్ష్యానికి మరింత చేరువవుతాం. ఉపాధి వేతనదారులకు జనవరి 5 నుంచి బకాయిలు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. త్వరలో నిధులు విడుదలవుతాయి. అయితే ఈ సమస్య అనకాపల్లి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జనవరి 5 తరువాత చేసిన ఉపాధి పనులకు కేంద్రం నుంచి నిధులు ఇంకా విడుదల అవ్వలేదు. అందుకే బకాయిలు పేరుకుపోయాయి. నిధులు మంజూరైన వెంటనే చెల్లింపులు ప్రారంభిస్తాం.
– పూర్ణిమాదేవి, డ్వామా పీడీ
అనకాపల్లి జిల్లా
సాక్షి, అనకాపల్లి :
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి.. ఏదో ఉపాధి పనులు ఆదుకుంటాయి కదా అని వస్తే ఏడు వారాలుగా పస్తులుండాల్సి వచ్చింది. వేతన బకాయిలు చెల్లించడానికి ఇంకెంత కాలం పడుతుందోనన్న బెంగ కూలీల గుండెల్లో గూడు కట్టుకుంది. జిల్లాలో 24 మండలాల పరిధిలో 2.89 లక్షల మంది ఉపాధి కూలీలకు ఉపాధి వేతనాలు సుమారుగా రూ.24 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. జనవరి 5వ తేదీ తరువాత నుంచి ఏడు వారాలుగా వేతన బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్బులు ఎప్పుడిస్తారో.. చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కోసం జిల్లాను నాలుగు క్లస్టర్లుగా విభజించారు.
ఒక్కో క్లస్టర్ పరిధిలో 6 మండలాలున్నాయి. నాలుగు క్లస్టర్ల పరిధిలో ఉన్న 24 మండలాల పరిధిలో దాదాపుగా ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. రోజంతా కష్టపడితే సగటున రూ.250–288లకు మించి కూలి డబ్బు పడడం లేదు. ఆ డబ్బు కూడా ఏడు వారాలుగా బకాయి ఉంది. ఒక్కో కూలీకి సగటున రూ.8,500 నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉందని సమాచారం. జిల్లాలో సుమారు రూ.24 కోట్లకు పైగా బకాయి ఉంది. జనవరి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన కూలీలకు కూలి సొమ్ము వచ్చింది. డిసెంబరు ఆఖరు వారం వరకు డబ్బులు వచ్చాయి. జనవరి మొదటి వారం నుంచి ఈ రోజు వరకు అంటే ఏడు వారాలుగా ఉపాధి వేతనాలు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కోటవురట్లలో అత్యధికంగా రూ.1.65 కోట్ల వేతన బకాయి ఉంది.
ఒక్కో రోజు లక్షకు పైగా కూలీలు..
ఎన్‌ఆర్‌ఈజీఎస్ అమలులో భాగంగా 2,81,075 జాబ్ కార్డులు జారీ చేశారు. అందులో పనులకు హాజరయ్యే యాక్టివ్ జాబ్ కార్డులు 2,02,924 వరకు ఉన్నాయి. పనులకు హాజరయ్యేవారు 2,07,896 మంది వేతనదారులున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజుకు లక్ష నుంచి లక్షా 20 వేలమంది వరకు హాజరయ్యారు. మార్చి నెల నుంచి కూలీలు పూర్తి స్థాయిలో పనులకు హాజరయ్యే అవకాశమున్నందున వేతన బకాయిలు చెల్లిస్తే 2 లక్షలకు పై చిలుకు వేతనదారులు పనులకు వస్తారు.
లేదంటే తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యం కాగా... 1.14 కోట్ల పనిదినాలు (ఫిబ్రవరి నెలాఖరు వరకు) పూర్తిచేశారు.
● ఆకులు పట్టుకొని ఉపాధి కూలీల వినూత్న నిరసన
దేవరాపల్లి: ఉపాధి హామీ వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి కూలీలు వినూత్న నిరసనకు దిగారు. తామరబ్బ గ్రామంలో మంగళవారం ఆకులు చేతపట్టుకొని నిరసన చేపట్టారు. బకాయిలైన చెల్లించండి... తిండైనా పెట్టండి అంటూ నినాదాలు చేసి వారి నిరసనను వెళ్లగెక్కారు. వీరికి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న మద్దతు పలికారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గత ఏడు వారాల నుంచి కూలీలకు సొమ్ము అందించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం చేసిన పనికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు గ్రామాలు విడిచి వలసలు పోతున్నారన్నారు. గత మూడేళ్లుగా బడ్జెట్‌లో నిధులకు కోత విధించి, మెటీరియల్ చార్జీలు పెంచేశారని, దీంతో కాంట్రాక్టర్లకు ముందు బిల్లులు చెల్లించి, కూలీలకు పెండింగ్ పెడుతున్నారన్నారు. గతంలో 20 శాతం సమ్మర్ అలవెన్స్ ఇచ్చేవారని, ఇప్పుడు పూర్తిగా కోత విధించారన్నారు. వెంటనే ఈ ఏడాది 30 శాతం సమ్మర్ అలవెన్స్‌తో పాటు మెడికల్ కిట్లు, టెంట్లు, తట్టా, గునపం, మంచినీటికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 200 రోజుల పనిదినాలు, రోజూ 600 కూలీ సొమ్ముతో పాటు ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈనెల 12న ఛలో విజయవాడ కార్యక్రమం పేరిట ఆందోళన చేపట్టనున్నామని, విజయవంతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న కోరారు.
తామరబ్బలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆకులు పట్టుకొని వినూత్న నిరసనకు దిగిన ఉపాధి హామీ కూలీలు
అప్‌లోడ్ చేసిన పక్షం రోజుల్లో డబ్బులు జమ చేయాలని నిబంధన
ఏడు వారాలుగా అందని వేతనాలు
జిల్లాలో వేతన బకాయి సుమారు రూ.24 కోట్లు
ఎదురుచూస్తున్న ఉపాధి కూలీలు 2.89 లక్షలు
వేతన వెతలు
వేతన వెతలు
వేతన వెతలు
Comments
Please login to add a commentAdd a comment