పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి
● లైంగిక వేధింపులకు దూరంగా పెంచాలి ● ఇది మనందరి బాధ్యత: డీఎంహెచ్‌వో రవికుమార్
తుమ్మపాల: లైంగిక వేధింపులకు దూరంగా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.రవికుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ‘పిల్లలకు లైంగిక వేధింపులు–నివారణ’ అనే అంశంపై మంగళవారం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. లైంగిక వేధింపులపై పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని, అపరిచితులతో జాగ్రత్తగా మసలుకునేటట్లు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. ఎన్‌సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జె.ప్రశాంతి మాట్లాడుతూ తల్లిదండ్రులే కాకుండా సమాజంలోని అందరూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవాలన్నారు. పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర స్థాయి ట్రైనర్ ఉదయ్‌కుమార్, సైకాలజిస్ట్ బి.నాగరాజు మాట్లాడుతూ పిల్లలు లైంగిక వేధింపులు జరగకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. వైద్యాధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్ సిబ్బంది, సైకియాట్రిస్ట్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో పడాల రవికుమార్ హెచ్చరించారు. జిల్లాలో 58 ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు, ఆస్పత్రులు, ల్యాబ్స్ ఎటువంటి లింగ నిర్థారణ పరీక్షలు చేపట్టినా కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడినవారిపై గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం–1994 ప్రకారం మొదటిసారి మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా, ఐదేళ్ల వరకు ధ్రువీకరణ రద్దు చేస్తామన్నారు. రెండోసారి తప్పు జరిగితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించి, వైద్య ధ్రువీకరణ శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment