ఉక్కుపాదం
ఉద్యమంపై షోకాజ్
● నినదించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ● స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీసు ● యాజమాన్య వైఖరికి నిరసనగా నేడు స్టీల్ సీఐటీయూ ధర్నా
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ఆలోచనలు చేయకుండా.. ఉక్కు భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై జులుం ప్రదర్శించడంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అత్యుత్సాహం చూపిస్తోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుల్ని భయపెట్టేందుకు యాజమాన్యం షోకాజ్‌లు జారీ చేస్తోంది. ఆది నుంచి పోరుబాటలో ముందున్న స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిరంతర పోరాటాల వల్లే..
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నోట నుంచి వచ్చినప్పటి నుంచి ఉద్యమ జ్వాల ఎగసిపడింది. అప్పటి నుంచి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, నిరంతరం రోడ్లపై ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాటం చేయడం వల్ల.. నాలుగేళ్లుగా విశాఖ స్టీల్‌ప్లాంట్ జోలికి కేంద్రం రాలేకపోయింది. తాజాగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా రూ.11 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. తాత్కాలిక ఉపశమనం కల్పించినా.. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ప్రైవేటీకరణ ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉండటంతో ఉద్యమ నాయకులు పోరాటం ఆపలేదు. అయితే స్టీల్‌ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు.. వీఆర్‌ఎస్, హెచ్‌ఆర్‌ఏ, ఉద్యోగులు, కార్మికుల జీతాల కోసం ఎక్కడా నోరు మెదపకూడదంటూ యాజమాన్యం ఆంక్షలు విధించింది. అయినా.. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడా వెనకడుగు వేయకుండా హెచ్‌ఆర్‌ఏ, విద్యుత్ చార్జీలు, వీఆర్‌ఎస్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం రోడ్డెక్కి పోరాడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌కు యాజమాన్యం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సీఐటీయూ గౌరవాధ్యక్షునిగా ప్రచారం చేశారంటూ మండిపడుతూ.. ఈ చర్యలపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎంఎంఎస్‌ఎం డిపార్ట్‌మెంట్ డిసిప్లినరీ అథారిటీ డీజీఎం(ఎలక్ట్రికల్) ఉమాకాంత్ గుప్తా నోటీసులో పేర్కొన్నారు.
యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ..
స్టీల్ యాజమాన్యం అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సీఐటీయూ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి తెలిపారు. నోటీసులు వెనక్కు తీసుకునేంత వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment