కుట్టు శిక్షణ ఉంది.. అంగన్‌వాడీ భవనం ఖాళీ చేయండి.!
● వమ్మవరంలో కూటమి నాయకుడి దౌర్జన్యం ● ఎటువంటి సమాచారం లేకుండా సామగ్రి తరలింపు ● అడ్డగించిన అంగన్‌వాడీ సిబ్బంది, లబ్ధిదారులు
ఎస్.రాయవరం: కూటమి నాయకుల బెదిరింపులకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. చిన్నారుల ప్రాథమిక విద్యకు ఎంతో ఉపయోగపడుతున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సైతం వదలడం లేదు. తమ అవసరాల కోసం మూడు నెలల పాటు ఈ కేంద్రాన్ని అప్పగించి వేరే చోటకు మారాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా కేంద్రంలోని సామగ్రిని పంచాయతీ స్వీపర్లతో తరలించడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. వమ్మవరం పంచాయతీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనంలో నాలుగేళ్లుగా రెండో నంబర్ గల అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు 18 ఏళ్ల పాటు ఈ కేంద్రం అద్దె భవనంలో నడిచేది. అప్పట్లో ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని సర్పంచ్ పాలపర్తి పాపారావు అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించారు. అప్పటి నుంచి దళిత కాలనీ పరిధిలో ఉన్న ఈ భవనంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు, కిషోర్ బాలికలకు సేవలందిస్తూ అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ కూటమి ప్రభుత్వం అండదండలతో మహిళలకు కుట్టు శిక్షణ ఉంది ఈ భవనం తనకు 3 నెలలు పాటు కావాలని ఒత్తిడి చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీ స్వీపర్లు వెంటబెట్టుకొని వచ్చి గురువారం ఈ భవనంలో ఉన్న అంగన్‌వాడీ సామగ్రిని తరలించే ప్రయత్నం చేశారు. ఉన్న పళంగా వేరే భవనానికి ఎలా వెళ్లాలని అంగన్‌వాడీ సిబ్బందితో పాటు లబ్ధిదారులు మాజీ ఎంపీటీసీని ప్రశ్నించారు. దళిత కాలనీకి అందుబాటులో ఉన్న ఈ భవనం నుంచి అంగన్‌వాడీ కేంద్రాన్ని తొలగించవద్దని, గ్రామానికి దూరంగా మారిస్తే చిన్నారులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. అయినా వినిపించుకోకపోవడంతో విషయం తెలుసుకున్న సర్పంచ్ పాపారావు, ఎంపీటీసీ బాలం సూరిబాబు కలగజేసుకున్నారు. భవనంలో తీసిన సామగ్రిని యథావిధిగా పెట్టి అక్కడి నుంచి వెనక్కి రావాలని సూచించారు.
దీంతో సామగ్రి తొలగింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు విషయమై ఇన్‌చార్జి ఎంపీడీవోను సంప్రదించగా.. కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రతిపాదన ఉందని, గ్రామంలో అనువైన భవనం చూసి ఏర్పాటు చేస్తామన్నారు. నిర్వహణలో ఉన్న అంగన్‌వాడీ భవనాన్ని ఖాళీ చేయాలని తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment