దారి కాచి దారుణం...
అనకాపల్లి : బుచ్చెయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన భీమవరపు నూకేష్ (28) ను బుధవారం రాత్రి అనకాపల్లి మండలం కుంచంగి గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పీక కోసి పరారయ్యారు. నూకేష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయాడు. అటుగా వెళుతున్న వాహనదారులు, స్థానికులు రోడ్డుపై పడి ఉన్న నూకేష్‌కుమార్‌ను హుటాహుటిన 108 వాహనంలో ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అశోక్‌కుమార్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం రూమ్‌లో భద్రపరిచి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా నలుగురు అనుమానితులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మృతుడి భార్య ఇందు, రెండేళ్ల కుమారుడు సాత్విక్, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ వైద్యాలయం వద్దకు చేరుకుని భోరున విలపించారు. భీమవరపు నూకేష్ విశాఖ డాక్‌యార్డులో కాంట్రాక్టర్ వద్ద కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం బుచ్చియ్యపేట నుంచి విశాఖకు బైక్‌పై రాకపోకలు సాగిస్తున్నాడు. గతంలో నూకేష్ బెట్టింగ్‌లో కొంత నగదు పోగొట్టుకోగా, ఆ సమయంలో బెట్టింగ్ గ్యాంగ్‌కు కుటుంబ సభ్యులు అప్పులు తీర్చారు. ప్రస్తుతం ఎటువంటి అప్పలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం సెలవు తీసుకుని ఇంటి వద్దనే ఉన్న నూకేష్ రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ కాల్ రావడంతో బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేట గ్రామానికి స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని వెళ్లాడు. అక్కడ నుంచి అనకాపల్లి వస్తుండగా కుంచంగి వద్ద నూకేష్ దుండగుల దాడికి గురయ్యాడు.
నిందితులను పట్టుకుంటాం : రూరల్ సీఐ అశోక్‌కుమార్
మండలంలో కుంచంగి గ్రామం వద్ద హత్యకు గురైన నూకేష్ ఘటనలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని, మృతుడి భార్య ఇందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.
దారి కాచి దారుణం...
Comments
Please login to add a commentAdd a comment