విజయోస్తు సీ్త్రరస్తు...!
సాక్షి, అనకాపల్లి: అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు ఎందులోనూ తీసిపోమని తమ తమ వృత్తుల్లో ప్రావీణ్యతను చాటుకుంటున్నారు. అమ్మలా లాలించడమే కాదు.. సమర్థవంతంగా పాలించడంలోనూ ముందుంటామని నిరూపించుకుంటున్నారు. వివిధ విభాగాల్లో అధికారులుగా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరూ మహిళలు కావడం విశేషం. జిల్లా యంత్రాంగంలో వివిధ విభాగాల్లో హెచ్‌వోడీలు మహిళలే ఉన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి శిరీషరాణి, పౌరసరఫరాల శాఖ అధికారి జయంతి, డీఎల్‌డీఓ మంజులావాణి, అనకాపల్లి డీఎస్పీ శిరీష, ఆర్డీవో షేక్ ఆయిషా.. ఇంకా డివిజన్, మండల స్థాయిలో వివిధ విభాగాల్లో మహిళా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా మహిళలదే అగ్రస్థానం. విధానపరమైన నిర్ణయాల అమలులోనూ అతివలు కీలకంగా నిలుస్తూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి జిల్లా రాజకీయ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
మహిళకు చదువు..
ఇంటికి వెలుగు
ఒక ఇంటిలో మహిళ చదువుకుని ఉద్యోగం చేస్తే.. ఆ ఇల్లంతా వెలుగుతూ ఉంటుంది. వారి చదువును తల్లిదండ్రులు నిర్ల క్ష్యం చేయకూడదు. వారికి చిన్నతనంలోనే పెళ్లి చేయడం తగదు. వారు మానసికంగా ఎదగాలి. తల్లిదండ్రుల ఆలోచనా విధానంతోనే మహిళ భవిష్యత్తు ఉంటుంది. పదో తరగతి తరువాత చదువులోనే కాదు.. వారు క్రీడలతో సహా ఏ రంగంపై ఆసక్తి చూపినా ప్రోత్సహించాలి. కుటుంబంలో ఒక మహిళ అభ్యుదయం వెనక తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు ప్రోత్సాహం ఉంటుంది.
– జాహ్నవి, జాయింట్ కలెక్టర్
ఏ పని చేపట్టినా విజయమే..
మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. మహిళలు ఏ పనైనా సమర్ధవంతంగా చేయగలరు. ఒక ఇంటి బాధ్యతను ఎంత సక్రమంగా నడపిస్తారో.. అదేవిధంగా విధుల్లోనూ రాణిస్తారు. గతంలో ఆడవారిని ఇంటికే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఆడపిల్ల విద్యాపరంగా... ఆర్థికంగా ఎదిగితే వారికి స్వతంత్రంగా అత్యున్నత స్థాయికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దేశాభివృద్ధిలో కూడా మహిళ పాత్ర ఉంది.
– విజయ కృష్ణన్, కలెక్టర్
విజయోస్తు సీ్త్రరస్తు...!
Comments
Please login to add a commentAdd a comment