చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు
యలమంచిలి రూరల్: చిన్నారులు, బాలలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారని యలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షురాలు పి.విజయ అన్నారు. శుక్రవారం యలమంచిలి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశ కార్యకర్తలు, పురపాలక సంఘం పరిధిలో మహిళా ఉద్యోగులకు పోక్సో చట్టంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉన్నత స్థానాల్లో ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు వంటి వారు తమ స్థానాన్ని ఆసరాగా చేసుకుని పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, ఇంకా తీవ్రమైన నేరాలకు పాల్పడితే మరింత కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ తీవ్రమైన నేరంగా చట్టం చెబుతోందన్నారు. లైంగిక నేరాల కేసులకు సంబంధించి బాధిత పిల్లల దగ్గర్నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్న సమయంలో వారు తమపై జరిగిన అఘాయిత్యాలను చెబుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతో పాఠశాలలు, కళాశాలల్లో వాళ్లతో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, సహచర విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలన్నారు. చెడు, మంచి స్పర్శల మధ్య తేడాను వారికి వివరించాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి, మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, యలమంచిలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ధూళి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment