వెంకన్న పెళ్లికొడుకాయెనే
● ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణానికి అంకురార్పణ నేడు ● ఉదయం పెండ్లి కావిడి ఊరేగింపు ● 10వ తేదీ రాత్రి కల్యాణం ● ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ
వేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు..
నక్కపల్లి:
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణానికి నేడు అంకురార్పణ జరగనుంది. మార్చి 10వ తేదీ సోమవారం రాత్రి ఉపమాకలో గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణం ఘనంగా జరగనుంది. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి వార్షిక కల్యాణం అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వార్షిక కల్యాణానికి సంబంధించి 9వ తేదీ ఆదివారం ఉదయం స్వామివారి పెండ్లి కావిడను ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు కానుకగా సమర్పిస్తారు. సాయంత్రం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ, కంకణధారణ, అంతరాలయ పూజ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తారు. తదుపరి సాయంత్రం అంకురార్పణకు శ్రీకారం చుడతారు. సుదర్సన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి మత్సంగ్రహణం (పుట్టమన్ను) తీసుకు రావడానికి ఉత్తర ఈశాన్య దిక్కున గల ప్రాంతానికి తీసుకెళ్తారు. అనంతరం అశ్వవాహనంపై తిరువీధి సేవ జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను అశ్వవాహనంలో ఉంచి మాడవీధుల్లో తిరువీధి సేవ నిర్వహిస్తారు. తర్వాత స్వామివారి కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీరుస్తారు. అంకురార్పణ చతుస్టాన అర్చనలు గరుడప్పాల నివేదన నిర్వహిస్తారు. దీంతో స్వామివారి కల్యాణ ఉత్సవాలు ప్రారంభమైనట్లేనని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు.10వ తేదీ ఉదయం ఉభయ దేవేరులను పెద్దపల్లకిలో కొలువుదీర్చి ఆలయం, గ్రామంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేసిన తర్వాత ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి వేంకటేశ్వర స్వామిని ఇత్తడి గరుడ వాహనంపై, ఉభయ దేవేరులను శేషవాహనంపై ఉంచి ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద కన్యావాద సంవాదం (ఎదురు సన్నాహ మహోత్సవం) నిర్వహిస్తారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం, కల్యాణం జరుగుతుంది.
300 మంది పోలీసులతో బందోబస్తు..
జిల్లా ఎస్‌పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు కల్యాణోత్సవాలకు సుమారు 300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ కుమారస్వామి తెలిపారు. ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలతో పాటు, స్పెషల్ బ్రాంచి పోలీసులు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మఫ్టీలో సిబ్బంది భద్రత కోసం పని చేస్తారన్నారు. 16 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, డ్రోన్ కెమెరాల సాయంతో భద్రత పర్యవేక్షిస్తామన్నారు. మనబానవానిపాలెం, నక్కపల్లిలో పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించామన్నారు. ఉపమాక వెళ్లే అన్ని మార్గాల్లోను చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 10వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతిస్తామన్నారు.
వెంకన్న పెళ్లికొడుకాయెనే
Comments
Please login to add a commentAdd a comment