తోడల్లుడే చంపించాడు...
● నగేష్‌కుమార్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు ● నిందితులకు 14 రోజుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఇన్‌చార్జి డీఎస్పీ మోహనరావు
అనకాపల్లి : మండలంలో కుంచంగి గ్రామంలో ఈనెల 5వ తేదీన బుచ్చియ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన భీమవరపు నగేష్‌కుమార్ హత్య కేసులో మృతుడి తోడల్లుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఇన్‌చార్జి డీఎస్పీ బి.మోహన్‌రావు చెప్పారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మృతుడి తోడల్లుడు కశింకోట శివాలయం వీధికి చెందిన పెద్దపూడి కిషోర్, అదే గ్రామానికి చెందిన మారేడుపూడి రాజేష్, కాకినాడ జిల్లా భానుగుడి జంక్షన్, మిలిటరీ రోడ్డుకు చెందిన గోరస నాగేశ్వరరావు కలసి భీమవరపు నగేష్‌కుమార్‌ను హత్య చేసినట్టు ఆయన తెలిపారు. కిషోర్, రాజేష్‌లు అనకాపల్లిలోని ఓ బంగారం షాప్‌లో గతంలో పనిచేశారని, కిషోర్ కశింకోటలో కొత్తగా దుకాణం పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నాడని డీఎస్పీ చెప్పారు. కిషోర్ షాప్ వద్దకు రాజేష్ అప్పుడప్పుడు వస్తుండేవాడన్నారు. అదే సమయంలో కాకినాడలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉన్న రాజేష్ మేనల్లుడి కొడుకు గోరస నాగేశ్వరరావు కూడా కిషోర్ దుకాణానికి వచ్చేవాడు. అదే షాప్‌కు పెద్దపూడి కిషోర్ తోడల్లుడైన నగేష్‌కుమార్ కూడా వస్తుండడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. వారంతా కలిసి వ్యాపార లావాదేవీలు సాగించే వారని, ఈ క్రమంలో వారి మధ్య గొడవలు ఉన్నాయని తెలిపారు. కాకినాడకు చెందిన గోరస నాగేశ్వరరావుకి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ నిమిత్తం పిస్టల్ కావాలని నాగేష్‌ను అడగడంతో రూ.10వేలు అవుతుందని చెప్పి తీసుకున్నాడు. తరువాత నగేష్ ఒక డమ్మీ పిస్టల్ తీసుకువచ్చి చూపించి మళ్లీ తీసుకువెళ్లిపోయాడు. దాని నగదును కూడా తిరిగి నాగేశ్వరరావుకు ఇవ్వకపోవడంతో అతను నగేష్‌పై కోపం పెంచుకున్నాడన్నారు. అదే సమయంలో మృతుడి తోడల్లుడు పెదపూడి కిషోర్ కూడా నగేష్‌పై వివిధ కారణాలతో పగ పెంచుకుని అతనిని హత్య చేయాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న మృతుడు (భీమవరపు నగేష్‌కుమార్), తోడల్లుడు పెద్దపూడి కిషోర్, మారేడుపూడి రాజేష్, గోరస నాగేశ్వరరావు బుచ్చియ్యపేట మండలం రాజాం వద్ద ధాబాలో మద్యం సేవించారు. ముందుగా పథకం వేసుకున్న ప్రకారం కాకినాడకు చెందిన గోరస నాగేశ్వరరావును అనకాపల్లి జాతీయ రహదారిలో బైక్‌పై దించాలని నగేష్‌ను కోరడంతో అతను పల్సర్ బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా అనకాపల్లి మండలం కుంచంగి గ్రామానికి వచ్చేసరికి నాగేశ్వరరావు తన వెంట తీసుకు వచ్చిన సర్జికల్ బ్లేడ్‌తో బైక్ నడుపుతున్న నగేష్ పీక కోసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే వెనుక వస్తున్న పెద్దపూడి కిషోర్, మారేడుపూడి రాజేష్ ఇద్దరూ నాగేశ్వరరావును అక్కడి నుంచి బైక్‌పై ఎక్కించుకుని కశింకోట జాతీయ రహదారిలో బస్ ఎక్కించి పంపేశారు. నిందితుల కాల్ డేటా ఆధారంగా కేసు ఛేదించినట్టు డీఎస్పీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ జి.అశోక్‌కుమార్, ఎస్‌ఐ జి.రవికుమార్, పట్టణ ఎస్‌ఐ వి.సత్యనారాయణ, ఏఎస్‌ఐ ఎస్.భాస్కర్‌రావు, హెచ్‌సీలు వై.సోమ్‌బాబు, కె.నూకరాజు, కానిస్టేబుళ్లు ఎస్.నారాయణ, పి.నరేంద్ర, ఎం.నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment