ప్లాట్‌ఫాంపైకి రావడం అంత వీజీ కాదు
● రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కొత్త వ్యూహాలు ● కన్‌ఫర్మ్ టికెట్స్ ఉంటేనే ప్లాట్‌ఫాంపైకి అనుమతి ● వెయిటింగ్ లిస్ట్ ఉంటే స్టేషన్ బయట ఉన్న హాల్‌లోనే.. ● త్వరలో విశాఖ రైల్వే స్టేషన్‌లో అమలుకు సన్నాహాలు
సాక్షి, విశాఖపట్నం: నేను టికెట్ తీసుకున్నాను. వెయిటింగ్‌లో ఉంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలాగైనా కన్‌ఫర్మ్ చేయించుకుని బెర్త్‌లో హాయిగా పడుకుంటానని అనుకుంటే.. ఇకపై ఆ పప్పులింక ఉడకవ్. ఎందుకంటే టికెట్ కన్‌ఫర్మ్ అయితేనే ప్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. లేదంటే కన్‌ఫర్మ్ టికెట్ ఉన్నవాళ్లు వెళ్లిన తర్వాత.. మీ టర్న్ వచ్చినప్పుడు మాత్రమే ట్రైన్ ఎక్కగలరు. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన దురదృష్టకర ఘటన నేపథ్యంలో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఒక అత్యున్నత సమావేశం జరిగింది. ప్లాట్‌ఫాంలపై ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురు నిపుణులు సూచనలు చేశారు. అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్లాట్‌ఫాంలపైకి ఒకేసారి ప్రయాణికులు గుంపులుగా రాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలను దేశవ్యాప్తంగా 60 ప్రధాన స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రైలు వచ్చిన తర్వాత, ప్రయాణికులను ఒకరి తర్వాత ఒకరిగా, వివిధ మార్గాల ద్వారా రైలు దగ్గరకు అనుమతిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కూడా ఈ తరహా నిబంధనలు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఏం చేస్తారంటే.?
● ప్లాట్‌ఫాంపై రద్దీని నియంత్రించేందుకు ఇకపై వెయిటింగ్ ప్రాంతాలను స్టేషన్ బయట ఏర్పాటు చేస్తారు. టికెట్ లేని ప్రయాణికులు కూడా స్టేషన్ వెలుపలే వేచి ఉండాలి. వెయిటింగ్ లిస్ట్‌లోని ప్రయాణికులను పంపిన తర్వాత, వారికి రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది.
● ముందుగా కన్ఫార్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫాంపైకి అనుమతిస్తారు.
● మరోవైపు స్టేషన్లలో మరింత వెడల్పుగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను(వంతెనలు) నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహాకుంభమేళా సమయంలో ఇలాంటి వెడల్పాటి వంతెనలు సమర్థవంతంగా పనిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్టేషన్లలో 6 మీటర్లు, 12 మీటర్ల వెడల్పు కలిగిన ఎఫ్‌వోబీలు రాబోతున్నాయి.
● రైల్వేస్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు సీసీ టీవీ నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా ఏర్పాటు చేస్తారు.
● సమన్వయాన్ని మెరుగుపరచడానికి సిబ్బందికి వాకీ టాకీలు, అత్యాధునిక అనౌన్స్‌మెంట్ సిస్టమ్, కాలింగ్ సిస్టమ్‌లతో సహా ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తారు.
● సంక్రాంతి, దసరా వంటి పండుగలు, సెలవుల సమయాల్లో రైల్వే స్టేషన్లలో వార్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి అమలు చేస్తారు.
● ప్రధాన స్టేషన్లలో ఆర్థికపరమైన విషయాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన స్టేషన్ డైరెక్టర్‌ను నియమించనున్నారు. ఈ అధికారి స్టేషన్ సామర్థ్యం, రైలు లభ్యతను బట్టి టికెట్లను ఎంత వరకు విక్రయించాలనే విషయాలను నిర్ణయిస్తారు.
● ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రైల్వేస్టేషన్ ప్రవేశంపై రైల్వే శాఖ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. స్టేషన్‌కు చేరుకోవడానికి ఉన్న అన్ని అనధికారిక ప్రవేశ మార్గాలను మూసివేస్తారు.
● విశాఖపట్నం ఇటీవలే ‘ఏ’గ్రేడ్ స్టేషన్‌గా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ తరహా నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. స్టేషన్‌కు అధికారికంగా, అనధికారికంగా ఎన్ని ప్రవేశ ద్వారాలు ఉన్నాయి? నిష్క్రమణ మార్గాలు ఎన్ని ఉన్నాయి? రోజువారీ రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని రైల్వే బోర్డు ఆదేశించినట్లు సమాచారం.
ప్లాట్‌ఫాంలు 8
స్టేషన్‌లో
మొత్తం ట్రాక్‌లు 10
రైల్వే స్టేషన్ విస్తీర్ణం
1,110,600
చ.అడుగులు
ఏటా ప్రయాణికుల
రాకపోకల ద్వారా ఆదాయం
సుమారు రూ.560 కోట్లు
ఏటా రాకపోకలు సాగించే
ప్రయాణికులు సుమారు 2 కోట్లు
విశాఖ రైల్వేస్టేషన్ సమాచారం
స్టేషన్ కేటగిరీ
నాన్ సబర్బన్ గ్రూప్
(ఎన్‌ఎస్‌జీ)1
Comments
Please login to add a commentAdd a comment