వడ్డాది వెంకన్న క్షేత్రానికి కల్యాణ శోభ
● నేటి నుంచి 15 వరకు కల్యాణోత్సవాలు ● ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు ● లక్షలాది మంది భక్తుల రాకతో భారీ బందోబస్తు ● అంకురార్పణ దొంగపెండ్లితో ప్రారంభమైన వేడుకలు ● నేడు ఏకాదశి ప్రత్యేక పూజలు, రాత్రికి శ్రీనివాస కల్యాణం
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి క్షేత్రం కల్యాణ శోభతో కాంతులీనుతోంది. సోమవారం ఉదయం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 152వ కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం అర్ధరాత్రి అంకురార్పణ చేసి స్వామివారి దొంగపెండ్లితో కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సోమవారం ఏకాదశి వేంకటేశ్వరస్వామి కల్యాణం జరగ్గా, ఆఖరి రోజు శనివారం రాత్రి స్వామివారి పవళింపు సేవతో వేడుకలు ముగుస్తాయి.
కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడిగా వడ్డాది వెంకన్నగా పేరొందడంతో ఏటా స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వీరి సౌకర్యార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వంద మందితో ఎస్‌ఐ శ్రీనివాసరావు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూలైన్‌లు, మంచినీటి సదుపాయం, వైద్య సేవలు అందేలా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, గ్రామ పెద్దలు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలకు, మెట్లు మార్గం, కల్యాణ వేదిక, కళావేదికలకు రంగులు వేసి, విద్యుద్దీపాలంకరణతో ముస్తాబు చేశారు. టికెట్ల కౌంటర్, ధ్వజ స్తంభం వద్ద, ఆలయంలోను, ఉత్సవ విగ్రహాలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్వామివారు కొలువైన గిరిజాంబ కొండ నుంచి వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్ వరకు కిలోమీటర్ల పొడవున మిరుమిట్లు గొలిపే విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కొండ కింద మెట్ల వద్ద భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆలయ చరిత్ర..
150 ఏళ్ల క్రితం వడ్డాది గ్రామానికి నారాయణభజీ అనే సాధువు భిక్షాటనకు వచ్చాడు. ఇక్కడ ప్రదేశాల్ని చూసి త్వరలోనే వడ్డాది పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన చెప్పి వెళ్లిన కొన్ని రోజులకే వడ్డాది పక్క గ్రామమైన విజయరామరాజుపేట కాళ్లవారి పాకల వద్ద రైతులు మంచినీరు కోసం నేలబావి తవ్వుతుండగా శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహాలు బయట పడ్డాయి. అప్పటి గ్రామ పెద్ద దొండా భగవంతులయ్య గ్రామ పెద్దలతో కలిసి వడ్డాదికి తూర్పు దిక్కున ఉన్న ఎత్తయిన గిరిజాంబ కొండపై వీటిని ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. దేవుడికి నిత్య ధూపదీప నైవేద్యాల కోసం 58 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. అప్పటి నుంచి భగవంతులయ్య కుటుంబ సభ్యులు ఆలయ వంశపారంపర్య ధర్తకర్తలుగా కొనసాగుతున్నారు.
ఐదు రోజులపాటు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు
కల్యాణ వేడుకల్లో భాగంగా ఈ నెల 10న వివిధ పూజలు, హామాలు, గజ, గరుడ వాహనాలపై తిరువీధి ఉత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 14న నాగవల్లి వసంతోత్సవం, చక్రస్నానం, 15న పుష్పాంజలి సేవ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. వడ్డాది కొండ దిగువున, నాల్గు రోడ్ల జంక్షన్‌లో వర్తక సంఘం ఆధ్వర్యంలో రోజూ రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు తిలకించేలా ఏర్పాటు చేశారు.
ఆలయానికి ఇలా చేరుకోవాలి
స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతి అరగంటకు నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ల నుంచి బస్సు సదుపాయం కలదు. విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు నుంచి వడ్డాదికి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.
వడ్డాది వెంకన్న క్షేత్రానికి కల్యాణ శోభ
Comments
Please login to add a commentAdd a comment