పి–4 సర్వే వేగవంతం చేయాలి
పి–4 సర్వేపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల : పేదరికం నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వ, ప్రవేటు, ప్రజల భాగస్వామ్యంతో (పి4) సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పి –4 సర్వే, పంచాయతీరాజ్, జిఎస్‌డబ్ల్యూఎస్, డ్వామా, జిల్లా పరిషత్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా బీటీ, సీసీ రోడ్లను మార్చి చివరినాటికి పూర్తి చేయాలన్నారు. ఈ వారం స్వర్ణంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి, తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని సూచించారు. పాఠశాలల ప్రహరీ పనులు, గోకులం షెడ్ల నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి వాటర్ ట్యాంక్‌లను శుభ్రపరిచి, మరమ్మతులు, క్లోరినేషన్ చేపట్టాలన్నారు. ఉపాధి పనులను, కేటాయించిన పనిదినాల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ వీరునాయుడు, డ్వామా పీడీ పూర్ణిమ దేవి, జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment