జో అచ్యుతానంద.. జోజో ముకుందా..
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల అనంతరం మూడు రోజుల పాటు జరిగే పుష్పయాగోత్సవాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉత్సవ మూర్తులను ముందుగానే అలంకరించిన అద్దాల మండపంలో గల ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండ్లు, పాలు నివేదనలు చేసి భక్తుల సమక్షంలో విశేష నీరాజనాలు సమర్పించారు. శ్రీవైష్ణవ స్వాములకు తాంబూలాలు అందజేసి నీరాట్టం సేవాకాలంలో స్వామివారికి పుష్పయాగోత్సవం (పవళింపు సేవ) మొదటిరోజు కార్యక్రమం పూర్తి చేశారు. అర్చకస్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా డోలోత్సవం
శుక్రవారం రాత్రి స్వామివారి డోలోత్సవం (అద్దపు సేవ) కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం స్వామివారికి రాజయ్యపేట సముద్రతీరంలో అవబృందం కార్యక్రమం నిర్వహించారు. సముద్ర జలాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి రాత్రి రథోత్సవం జరిపారు. తదుపరి ఆలయానికి తీసుకువచ్చి అద్దపుసేవ నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారు కొత్త కళతో వెలిగిపోతూ ఉంటారు. నేరుగా చూస్తే భక్తులకు దృష్టి దోషం కలుగుతుందనే ఉద్దేశంతో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని ఊయలలో ఉంచి అద్దంలో చూపిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని అద్దంలో చూసి పరవశులయ్యారు. అనంతరం మాడవీధుల్లో తిరువీధి సేవ (దొంగల దోపు ఉత్సవం) నిర్వహించారు. తదుపరి ఆస్థాన మండపంలో లక్ష్మీ సంవాద కార్యక్రమం జరిగింది. దీంతో స్వామివారికి ఐదు రోజులపాటు నిర్వహించిన కల్యాణోత్సవాలు పరిసమాప్తమయ్యాయని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు.
వడ్డాది వెంకన్నకు పుష్పాంజలి సేవ
బుచ్చెయ్యపేట: ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. కల్యాణ వేడుకల్లో ఆఖరి రోజు వేంకటేశ్వరస్వామికి ఇష్టమైన శనివారం రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి ఆలయ మండపంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఊయలలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి జోలపాటలతో పుష్పాంజలి (పవళింపు) సేవ చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని బుగ్గన పెళ్లి చుక్కతో శ్రీదేవి, భూదేవి నడుమ ఇమిడిపోయిన వేంకటేశ్వరస్వామి అందాన్ని చూసి పరవశించిపోయారు.
ఛలోక్తులతో కూడిన జోల పాటలు, భక్తి గీతాలు పాడుతూ ఉత్సాహంగా ఊయల సేవ చేశారు. పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు స్వామికి జోల పాడేందుకు పోటీ పడ్డారు. రాత్రికి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి.
వెంకన్న పవళింపు సేవలో పాల్గొని తరించిన భక్తజనం
ఉపమాకలో పుష్పయాగోత్సవాలు ప్రారంభం
జో అచ్యుతానంద.. జోజో ముకుందా..
Comments
Please login to add a commentAdd a comment