చింతపండుకు భలే డిమాండ్
● దేవరాపల్లి వారపు సంతలో హాట్‌కేకుల్లా విక్రయాలు ● మణుగు రూ.550 నుంచి రూ.650 వరకు పలికిన ధరలు ● ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో ధరలకు రెక్కలు
దేవరాపల్లి: ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగా ఉండడంతో చింత పండుకు డిమాండ్ ఏర్పడింది. ధర పెరిగినా దేవరాపల్లిలో ఆదివారం జరిగిన వారపు సంతలో హాట్‌కేకుల్లా విక్రయాలు జరిగాయి. దేవరాపల్లిలో నాణ్యమైన చింతపండుతో పాటు అందుబాటు ధరలో లభిస్తుందని నమ్మకంతో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి ఇక్కడి సంతకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సంతకు చింతపండు అరకొరగా వచ్చింది. సమీప గిరిజన ప్రాంత నుంచి కూడా తక్కువ మొత్తంలోనే చింతపండు వచ్చింది. కొనుగోలుదారులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికి అందుకు తగ్గట్టుగా చింతపండు లేక పోవడంతో డిమాండ్ ఏర్పడింది. కొనుగోలుదారులు పోటీ పడడంతో గంటల వ్యవధిలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. మణుగు(10 కేజీలు) చింతపండు నాణ్యత ఆధారంగా రూ. 550 నుంచి రూ.650 వరకు ధర పలికింది. సాధారణంగా చింతపండు ధరలు రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. అయితే దిగుబడి తగ్గిపోవడంతోనే అమాంతం ధరలు పెరిగాయని పలువురు అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరిగే సంతకు చింతపండు మరింత తక్కువగా రానుండడంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుందని పలువురు కొనుగోలుదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేవరాపల్లిలో చింతపండు కొనుగోలుదారులతో కిక్కిరిసిన వారపు సంత
దేవరాపల్లిలో చింతపండు కనుగోలుదారులతో కిక్కిరిసిన వారపు సంత
Comments
Please login to add a commentAdd a comment