
లెక్కలు సరే.. తిప్పల మాటేమిటి?
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య.. భూ వివాదం, ఇంటి సమస్య, దారి సమస్య, భూ సర్వే, అందని పింఛన్, ఉద్యోగాల పేరిట మోసం, పాసు పుస్తకం కోసం మామూళ్లు వసూలు.. ఇలా వందలు, వేల ఫిర్యాదులతో బాధితులు కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్నారు. అధికారుల లెక్కలు చూస్తే సమస్యలు ఇట్టే పరిష్కారమైనట్టు కనిపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలు బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. ‘సాక్షి’ బృందం సోమవారం పలువురు అర్జీదారులను పలకరించింది.
ప్రజా సమస్యల అపరిష్కృత వేదికగా పీజీఆర్‌ఎస్
తమ పరిధిలో లేదని చెప్పినా.. పరిష్కరించినట్లే.!
క్షేత్రస్థాయిలో మాత్రం పరిష్కారం శూన్యమే..
రెవెన్యూ పరిధిలోనే అత్యధిక ఫిర్యాదులు
అర్జీదారుల సమస్యలు ఆలకిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి
సాక్షి, అనకాపల్లి:
ఉన్నతాధికారులకు తమ గోడు చెప్పుకుంటే బాధ తీరుతుందని సామాన్య ప్రజలు ఆశిస్తారు. సోమవారం కలెక్టర్ సహా జిల్లా అధికారులు స్వయంగా తమ అర్జీలు స్వీకరిస్తారు కాబట్టి ఇక తమ కష్టం తీరినట్టేనని భావిస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) పనితీరుపై నిరంతరం సమీక్షలు జరుగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో బాధితులకు పరిష్కారం లభించడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్ నుంచి ఇప్పటి వరకు 45,346 ఫిర్యాదులు రాగా వీటిలో 42 వేల అర్జీలను క్లోజ్ చేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ‘క్లోజ్’ చేయడమంటే పరిష్కరించినట్టేనా?.. ఈ ప్రశ్నకు అధికారులే బదులివ్వాలి. ‘ఈ సమస్య మా పరిధిలో లేదు’ అని కొన్ని అర్జీలకు సమాధానం ఇస్తారు. వాటిని కూడా పరిష్కరించినట్టే భావిస్తే.. ఇక సామాన్యుల సమస్యలు తీర్చేదెవరు?
కలెక్టర్, ఆర్డీవోల ఆదేశాలు బేఖాతర్
ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖాధికారులకు, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో.. బాధితులు పలుమార్లు తిరగాల్సి వస్తోంది. ఒకే సమస్యపై నెలల తరబడి పీజీఆర్‌ఎస్‌లో పదే పదే ఫిర్యాదులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన బాధితులను ఎవరిని కదిలించినా.. తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారని, సగానికి పైగా అర్జీలను ఆన్‌లైన్‌లో అసలు నమోదే చేయడం లేదని మరికొంతమంది వాపోతున్నారు. కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు జారీ చేసే ఆదేశాలను క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
వెల్లువగా వినతులు..
అరకొర పరిష్కారం..
జిల్లాలో జూన్ నెల నుంచి నేటి వరకూ 45,346 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 42,237 ఫిర్యాదులను క్లోజ్ చేసినట్లు, 3,109 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే ఫిర్యాదు చేసిన బాధితులు మాత్రం తమ సమస్యలు పరిష్కారం కావడంలేదని, తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఆయా సంబంధిత అధికారి ఫోన్ చేసి మీ సమస్య పరిష్కార యోగ్యమైనది కాదు..అని ఏదో ఒక కారణం చెప్పి వివరణ మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. అలాంటి కేసులను కూడా క్లోజ్ చేసినట్లు చూపుతున్నారని, వచ్చిన ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి సగం కూడా లేవని బాధితులు వాపోతున్నారు.
సోమవారం 340 వినతులు
సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, కేఆర్‌సీపీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 340 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 209 ఉండగా, పోలీసు శాఖ 23, పంచాయతీరాజ్ శాఖ 27, సర్వే సెటిల్ మెంట్ 11, హౌసింగ్ 10, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం 8, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, కార్పొరేషన్ 5, రూరల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించినవి 10 ఫిర్యాదులున్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 33 వినతులు వచ్చాయి.

లెక్కలు సరే.. తిప్పల మాటేమిటి?

లెక్కలు సరే.. తిప్పల మాటేమిటి?
Comments
Please login to add a commentAdd a comment