నూకాంబికకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు
● భక్తుల రాకపోకలకు నాలుగు ప్రధాన రహదారుల గుర్తింపు ● దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శోభారాణి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శోభారాణి, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో వెంపల రాంబాబు
అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండగగా గుర్తించినందున ప్రభుత్వం నుంచి అమ్మవారి జాతరకు పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శోభారాణి చెప్పారు. స్థానిక గవరపాలెం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు అమ్మవారి పండగ జరుగుతుందన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రధానమైన నాలుగు రహదారులు గుర్తించామని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. అమ్మవారి జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు) మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న పొలాల్లో నెల రోజులపాటు అమ్మవారి జాతరకు రైతులు తమ వంతు సహాయం అందిస్తున్నారని చెప్పారు. ప్రతి ఆదివారం అమ్మవారి దర్శనానికి సుమారు లక్షమంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నామన్నారు. ఆలయ ఈవో వెంపల రాంబాబు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే నాలుగు ప్రధాన రహదారుల్లో 29 సీసీ కెమెరాలు, ఆలయం వద్ద 20 కూలర్లు, మెడికల్ క్యాంపులు, బాలింతలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ ఏడాది ప్రత్యేక కార్యాలయం ప్రత్యేక పీఆర్వో కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment