రైతన్న గుండె మండింది.. | - | Sakshi
Sakshi News home page

రైతన్న గుండె మండింది..

Published Wed, Mar 19 2025 1:26 AM | Last Updated on Wed, Mar 19 2025 1:22 AM

రైతన్న గుండె మండింది..

రైతన్న గుండె మండింది..

దేవరాపల్లి: విత్తు నాటాడు.. నీరు పోశాడు.. బాగా ఎదగాలని ఎరువులు వేశాడు.. పండిన చెరకు గడలను చూసి మురిసిపోయాడు.. లాభాల తీపి ఊహించుకొని ఆనందపడ్డాడు.. కానీ పెట్టుబడులకు సరిపడా గిట్టుబాటు ధర లేకపోవడం, గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీలో సక్రమంగా క్రషింగ్‌ జరపకపోవడంతో కలత చెందిన రైతు తన పంటకు తానే నిప్పంటించుకున్నాడు. దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రైతు రొంగలి వెంకటరావు కన్నీటి కథ ఇది. కె.కోటపాడు మండలం మేడిచెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలో వెంకటరావు 80 సెంట్ల విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తున్నాడు. పంట కోత దశకు చేరుకున్న తరుణంలో గిట్టుబాటు ధర లేకపోగా, గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీలో తరచూ క్రషింగ్‌ నిలిచిపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ పంటను ఫ్యాక్టరీకి తరలించినా సకాలంలో పేమెంట్లు రాక.. కనీసం కోత కూలి, రవాణా చార్జీలు చెల్లించే పరిస్థితి లేదని భావించిన రైతు గత్యంతరం లేక బాధతో పంటకు నిప్పంటించాడు. గతంలో 50 టన్నుల వరకు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసేవాడినని, అప్పట్లో ప్రతి 15 రోజులకోసారి పేమెంట్లు ఇచ్చేవారని వెంకటరావు తెలిపాడు.

ప్రస్తుతం చెరకుతో రోజుల తరబడి కాటా, ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీంతో చెరకు ఎండిపోయి బరువు తగ్గి మరింత నష్టం వాటిల్లుతుందని, సాగు చేసిన పంటకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో నిప్పు పెట్టానని చెప్పాడు. ఈ చర్యతోనైనా కూటమి ప్రభుత్వానికి రైతుల కష్టాలపై కనువిప్పు కలగాలన్నాడు.

కలెక్టర్‌ ఆదేశాలతో జేసీ విచారణ

రైతు స్వయానా చెరకు తోటకు నిప్పు పెట్టిన ఘటనపై కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. ఆమె ఆదేశాలతో జేసీ జాహ్నవి గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ ఎండీ, రెవెన్యూ అధికార్లతో కలిసి సంఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధిత రైతు వెంకటరావుతో మాట్లాడారు. చెరకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ఫ్యాక్టరీ సక్రమంగా క్రషింగ్‌ జరపక పోవడం పట్ల ఆవేదనతో తానే పంటకు నిప్పు పెట్టినట్లు రైతు తెలియజేశారు. వెంటనే రైతుకు జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికార్లను జేసీ ఆదేశించారు. పంటను వెంటనే ఫ్యాక్టరీకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ ఎండీని ఆదేశించారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు మొత్తం తీసుకోవడం జరుగుతుందని, 2600 ఎకరాలలో చెరకు క్రషింగ్‌ రెండు వారాలలో పూర్తి చేస్తామన్నారు. చెరకు బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. జేసీ వెంట దేవరాపల్లి, కె.కోటపాడు రెవెన్యూ అధికార్లు, స్థానిక ఏవో వై. కాంతమ్మ, కొత్తపెంట సర్పంచ్‌ రొంగలి వెంకటరావు తదితర్లు ఉన్నారు

కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే చెరకు రైతుకు ఈ దుస్థితి : సీపీఎం నేత వెంకన్న

కొత్తపెంటలో చెరకు రైతు తన పంటకు నిప్పు అంటించుకున్నారని విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధిత రైతును ఓదార్చారు.

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని చెప్పిన ఎంపీ సీఎం రమేష్‌, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు గెలుపొందాక కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. ప్రధాన మోడి వద్ద తనకు పలుకుబడి ఉందని ఊదరగొట్టిన ఎంపీ సీఎం రమేష్‌ ఫ్యాక్టరీని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement