కట్టుకున్న వాడే.. కాలయముడు
● వీడిన ట్రాన్స్‌జెండర్ హత్య కేసు మిస్టరీ
● అనుమానం, రెండో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఘాతుకం
కశింకోట: కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపాడో భర్త. విషయం బయటపడితే జైలుకెళ్లాల్సి వస్తుందని భయపడి మృతదేహాన్ని మూడు ముక్కలుగా కత్తితో కోసి వేర్వేరు చోట్ల పడేశాడు. మీడియాలో వార్తలు రావడంతో పాటు హిజ్రాలు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కశింకోట పోలీసు స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన బండి దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ(35) నాలుగేళ్ల కిందట అనకాపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ దీపు అలియాస్ దిలీప్‌కుమార్(35)ను ఆలయంలో వివాహం చేసుకొని మునగపాక మండలం నాగులాపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపు ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె ఆభరణాలు కాజేయాలని నిందితుడు భావించాడు. అంతే కాకుండా రెండో వివాహం చేసుకోవాలని యోచించాడు. అందుకు దీపు అడ్డు పడింది. నాలుగైదు రోజులుగా ఈ విషయమై ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. దీంతో దీపును అడ్డు తొలగించుకోవాలని బన్నీ పన్నాగం పన్నాడు. హత్య చేయాలని కత్తి కూడా తెచ్చుకుని సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 17న గొడవ జరగడంతో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తువ్వాలుతో ఆమె పీక నులిమి హత్య చేశాడు.
మృతదేహాన్ని ముక్కలు చేసి..
హత్య వార్త బయటకు పొక్కకుండా, ఆనవాళ్లు బయట పడకుండా దీపు మృతదేహాన్ని బన్నీ బాత్ రూంలోకి తీసుకెళ్లి మూడు భాగాలుగా క్రూరంగా కత్తితో కోశాడు. వాటిని అదే రోజు రాత్రి ఒక్కొక్క చోట పడేశాడు. కుడి చేయి, నడుం కింద భాగాన్ని దుప్పట్లో చుట్టి దర్జాగా స్కూటీలో తీసుకెళ్లి మండలంలోని బయ్యవరం వద్ద జాతీయ రహదారి వంతెన కింద పడవేసి వెళ్లిపోయాడు. అలాగే బులెట్‌పై తల భాగాన్ని సంచిలో ఉంచి అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని కాలువలో పడేశాడు. తాళ్లపాలెంలో జాతీయ రహదారి వంతెన కింద గెడ్డలో మొండెం భాగాన్ని సంచిలో వేసి బుల్లెట్‌పై తీసుకెళ్లి పడవేశాడు. ముందుగా బయ్యవరంలో ట్రాన్స్‌జెండర్ నడుం దిగువ భాగాలు, కుడి చేయి లభ్యం కావడంతో హత్య సంఘటన వెలుగు చూసింది. అవి మహిళ శరీర భాగాలుగా గుర్తించి హత్య కేసు నమోదు చేసి 8 ప్రత్యేక బృందాలను నియమించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్ ధరించిన ఆభరణాలు, గుర్తులతో పత్రికలు, మీడియాలో కథనాలు రావడంతో వాటిని చూసిన అనకాపల్లిలోని హిజ్రాలు పోలీసులకు మృతిరాలి ఆచూకి గురించి సమాచారం అందించారు. దీంతో పోలీసులు హత్యకు గురైనది ట్రాన్స్‌జెండర్ దీపుగా నిర్ధారించారు. అనకాపల్లి, తాళ్లపాలెం వద్ద పడవేసిన మృతదేహం మిగిలిన భాగాలను గుర్తించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. 8 పోలీస్ ప్రత్యేక బృందాలతో నిర్వహించిన విచారణలో హంతకుడు బన్నీగా గుర్తించారు. నిందితుడు పరారు కావడానికి ప్రయత్నించగా బుధవారం రాత్రి మండలంలోని విసన్నపేట గ్రామం వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్డులో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కేసు విషయంలో మరి ఎవరి ప్రమేయం ఉందా? లేదా? అనే విషయమై మున్ముందు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి బన్నీయే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. 24 గంటల్లోగా నిందితున్ని అరెస్ట్ చేశామన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన ట్రాన్స్‌జెండర్ కుటుంబానికి సహాయం అందించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ఘటనలో వాడిన బుల్లెట్, కత్తి, మృతురాలితో పాటు నిందితుడిని సెల్‌ఫోన్లు, సంఘటన స్థలంలో నిందితుడి నగదు, వస్త్రాలు, మృతురాలి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు మిస్టరీని త్వరితగతిన ఛేదించిన డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐలు మనోజ్‌కుమార్, లక్ష్మణరావు, ఇతర సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
కట్టుకున్న వాడే.. కాలయముడు