విద్యుత్ ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే పరిహారం
తుమ్మపాల: విద్యుత్ ఫిర్యాదులు కాలపరిమితిలోగా పరిష్కారం కాకపోతే వినియోగదారులకు విద్యుత్ శాఖ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్‌పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి బి.సత్యనారాయణ స్పష్టం చేశారు. గవరపాలంలో గల గౌరీ గ్రంథాలయంలో నెహ్రూ యువ కేంద్రం, వినియోగదారుల ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్, మండల వినియోగదారుల మండలి సహకారంతో ‘విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) ప్రయోజనాలు’ అంశంపై శనివారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్తు సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా సీజీఆర్‌ఎఫ్‌కు వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ నంబర్ 94936 81912 ద్వారా గానీ, chrper@ apeastern power.com ఈ మెయిల్ పోస్టు ద్వారా ఆన్‌లైన్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారులు సమస్య ఉత్పన్నమైన నాటి నుంచి రెండేళ్లలోపు నిర్దేశిత దరఖాస్తులో రాతపూర్వకంగా సీజీఆర్‌ఎఫ్‌కు ఫిర్యాదు చేయవచ్చని, 60 రోజుల్లోపు తీర్పు వెలువడుతుందన్నారు. అయితే దీనికి ముందు 1912కు, క్షేత్ర స్థాయి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసి తిరుగు రశీదులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పలు సమస్యలపై విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గొర్లి మహేశ్వరరావు, సీజీఆర్‌ఎఫ్ సభ్యులు షైక్ బాబర్, వి.మురళీకృష్ణ, సమాచార హక్కు ఉద్యమకర్తలు కె.శ్రీరామకిషోర్, ఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.వి.రామరెడ్డి, గౌరీ గ్రంథాలయ అధ్యక్షుడు డి.నూకఅప్పారావు వినియోగదారులు పాల్గొన్నారు.
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్‌పర్సన్ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment