ఆఖరి నిమిషంలో.. హంగామా
ఎంవీపీకాలనీ: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో జిల్లా బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించడం దుమారం రేపింది. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం ఉపాధి కోసం బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, కమ్మ, ఆర్యవైశ్య ఇలా ఆ కార్పొరేషన్ పరిధిలోని అనేక అనుబంధ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలోని వెనుకబడిన తరగతుల వారికి రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేసి, తొలుత దరఖాస్తులకు 22వ తేదీని చివరి తేదీగా పేర్కొంది. అయితే, తాజాగా మరో మూడు రోజులు దరఖాస్తు గడువును పొడిగించింది. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం, ఏడాది మొత్తం వదిలేసి ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో రుణాల నోటిఫికేషన్ విడుదల చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, గడువును పొడిగించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రుణాలు లబ్ధిదారులకు అందుతాయా లేదా కేవలం ప్రచారం కోసమే కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌తో హడావిడి చేస్తుందా అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
20,914 మంది దరఖాస్తులు
స్వయం ఉపాధి, జనరిక్ ఫార్మసీలు, వివిధ కులవృత్తులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన 11 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 20,914 ఆన్‌లైన్ దరఖాస్తులు(శనివారం సాయంత్రం 4 గంటల వరకు) వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం కేవలం 6,032 యూనిట్ల మంజూరు లక్ష్యాన్ని నిర్దేశించగా, వచ్చిన దరఖాస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం రోజులే ఉండటంతో, ఈ భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాల ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అయితే ఈసారి మాత్రం 2024–2025 సంవత్సరానికి సంబంధించిన రుణాల ప్రక్రియను మార్చి చివరిలో ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు, కేవలం 11 రోజుల వ్యవధిలో 20 వేలకు పైగా దరఖాస్తులు రావడం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ హడావుడి నోటిఫికేషన్ ద్వారా తమకు కావాల్సిన వారికే రుణాలు మంజూరు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత లోపించే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం పూర్తిచేస్తాం
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27 నాటికి రుణాలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మే 1 నాటికి మంజూరు ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి. మే 11 నాటికి జియోట్యాగింగ్, మే 21 నాటికి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆదేశాలతో ముందుకు సాగుతున్నాం. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో నోటిఫికేషన్ విడుదలైన విషయం వాస్తవమే. అందుకే రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది.
– శ్రీదేవి, ఈడీ బీసీ కార్పోరేషన్
బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో గందరగోళం
ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో హడావుడిగా నోటిఫికేషన్
2024–25 ఏడాది సబ్సిడీ రుణాలంటూ దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ తీరు, రుణాల మంజూరుపై సర్వత్రా అనుమానాలు
ఆఖరి నిమిషంలో.. హంగామా
Comments
Please login to add a commentAdd a comment