
పంట పొలాల్లో బస్సు బోల్తా
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం పురుషోత్తపురం సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు పురుషోత్తపురం సమీపంలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కగా ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. అప్పటివరకూ సాఫీగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురై అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో బస్సులో ప్రయాణికులంతా భయంతో కేకలు పెట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పురుషోత్తపురం గ్రామస్థులు ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను బస్సులోంచి బయటకు తెచ్చేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్సు వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కె.వెంకటలక్ష్మి (64) తీవ్రంగా గాయపడింది. ఆమె తలకు బలమైన గాయం తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమెకు ప్రథమ చికిత్స అనంతరం మెదడుకు సీటీ స్కాన్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ కిరణ్ కుమార్(50), సీహెచ్ సుదర్శన్ (53), అన్నవరానికి చెందిన కె.సీతామహాలక్ష్మి (64), నారాయణపేటకు చెందిన జి.రాజు (35), బి.నవీన (30) గాయపడిన వారిలో ఉన్నారు. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉందని డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం
ఆరుగురికి గాయాలు
ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స

పంట పొలాల్లో బస్సు బోల్తా

పంట పొలాల్లో బస్సు బోల్తా