
కాంట్రాక్టు కార్మికుడి అనుమానాస్పద మృతి
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడని పరిశ్రమ యాజమాన్యం చెబుతుండగా, విష వాయువులు పీల్చడం వల్లే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. వివరాలివి. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన బావురిశెట్టి నాగేశ్వరరావు(55) గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో మూడేళ్లుగా క్లీనింగ్ పనులు చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం క్లీనింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. తోటి కార్మికులు ఈ విషయాన్ని పరిశ్రమ యాజమాన్యానికి తెలియజేయగా, నాగేశ్వరరావును వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగేశ్వరరావుకు భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి వివాహం అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు కింద నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా.. కాంట్రాక్టు కార్మికుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.