యువకుడి సాహసయాత్ర.. నార్పల టు లడఖ్ | - | Sakshi
Sakshi News home page

యువకుడి సాహసయాత్ర.. నార్పల టు లడఖ్

Published Sat, Apr 29 2023 10:12 AM | Last Updated on Sat, Apr 29 2023 11:22 AM

- - Sakshi

అనంతపురం డెస్క్‌ : మనం బైక్‌పై వంద, రెండు వందల కిలోమీటర్లు తిరగ్గానే బాగా అలసిపోతాం. బైక్‌లో కంటే బస్సులోనో, రైల్లోనో వెళ్లి ఉంటే బాగుండేదని అనుకుంటాం. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. బైక్‌పై దేశాన్ని చుట్టేయాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాడు. ఒకట్రెండు కాదు..ఏకంగా 177 రోజులు బైక్‌యాత్ర చేపట్టాడు. 10,020 కిలోమీటర్ల సుదీర్ఘదూరం ప్రయాణించాడు. అందరితో శభాష్‌ అనిపించుకున్న ఆ యువకుడే నార్పల మండల కేంద్రానికి చెందిన యనమచింతల బాలకృష్ణ అలియాస్‌ బాలు.

ఆసక్తే ముందుకు నడిపించింది..
బాలు తల్లిదండ్రులు నార్పలలో హోటల్‌ నిర్వహిస్తున్నారు. అతను కూడా మొబైల్‌ సర్వీస్‌ సెంటర్‌తో పాటు టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) చదివినప్పటికీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు. బైక్‌పై సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రదేశాలకు వెళ్లిరావడం హాబీగా మలచుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో రామేశ్వరం, ఊటీతో పాటు కర్ణాటకలోని పలు ప్రదేశాలను బైక్‌పై వెళ్లి చూసొచ్చాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి కూడా వెళ్లాడు. ఈ కోవలోనే లడఖ్‌ యాత్రను కూడా విజయవంతంగా పూర్తి చేసి పలువురి మన్ననలు పొందాడు.

సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌పై యాత్ర
బాలు లడఖ్‌ యాత్రకు అపాచీ 200 సీసీ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ పై 2022 జూలై 13న నార్పల నుంచి బయలుదేరాడు. మొదట శ్రీశైల మల్లన్నను దర్శించుకుని యాత్ర కొనసాగించాడు. హైదరాబాద్‌, నాగపూర్‌, జాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా, ఢిల్లీ, కురుక్షేత్ర, చండీగఢ్‌, అమృత్‌సర్‌, జమ్మూ, చీనాబ్‌ బ్రిడ్జ్‌, శ్రీనగర్‌, కార్గిల్‌ మీదుగా లడఖ్‌ చేరుకున్నాడు. మార్గమధ్యంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి..వాటికి సంబంధించిన వివరాలు సేకరించాడు. లడఖ్‌ నుంచి తిరుగు ప్రయాణంలో హిమాచల్‌ప్రదేశ్‌ మీదుగా కాంగ్రా, ధర్మశాల, జ్వాలాముఖి, నైనాదేవి, కేదర్‌నాథ్‌కు వెళ్లాడు. తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఈ ఏడాది జనవరి ఐదో తేదీన నార్పలకు చేరుకున్నాడు. సుదీర్ఘయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన బాలును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బైక్‌యాత్రలో భాగంగా బాలు పలు వీడియోలు చిత్రీకరించాడు. వాటిలో కొన్నింటిని తన యూట్యూబ్‌ చానెల్‌ (బాలు సన్‌రైజ్‌ ట్రావెలర్‌)లో అప్‌లోడ్‌ చేశాడు.

ఆదుకున్న జవాన్లు
ప్రపంచంలోనే రెండవ అత్యంత చల్లని ప్రదేశమైన ద్రాస్‌ వద్ద (కార్గిల్‌కు సమీపంలో) మైనస్‌ 10 డిగ్రీల చలిని తట్టుకోలేక బాలు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి చూపించుకోగా.. మూడు రోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో భారత ఆర్మీ జవాన్లు తమ క్యాంపులో ఉండటానికి చోటు కల్పించారు. ఆరోగ్యం కుదుట పడేవరకు బాగా చూసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడగానే బాలు యాత్ర కొనసాగించాడు. కాగా.. బాలు తీసుకెళ్లిన నగదును జమ్మూలోని డార్మెటరీలో దొంగలు అపహరించారు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఆన్‌లైన్‌లో డబ్బు పంపి ఆదుకున్నారు.

ఎవరెస్ట్‌కు వెళ్లాలనుంది 
నాకు బైక్‌ రైడింగ్‌తో పాటు ట్రెక్కింగ్‌ కూడా ఇష్టమే. కాలేజీ రోజుల్లో తరచూ ట్రెక్కింగ్‌ వెళ్లేవాడిని. ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్నది లక్ష్యం. కనీసం బేస్‌ క్యాంపు దాకా వెళ్లినా నా లక్ష్యం నెరవేరినట్టే. బైక్‌యాత్రలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించా. ఎక్కడా హోటల్‌లో విడిది చేయలేదు. డార్మెటరీలు, ఆలయాలు, గురుద్వారాల్లో విడిది చేస్తూ వెళ్లా. దీనివల్ల తక్కువ బడ్జెట్‌లోనే యాత్ర పూర్తి చేయగలిగా. వాఘా, సుచిత్‌ఘర్‌, కార్గిల్‌ దగ్గర.. ఇలా మూడుచోట్ల పాకిస్తాన్‌ బార్డర్‌ను చూడడం మరచిపోలేని అనుభూతి. – బాలకృష్ణ, నార్పల
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement