నిన్నే నమ్ముకున్నాం సారూ.. మరొక్కమారు నాకు చాన్స్‌ ఇవ్వరూ ప్లీజ్‌.. | Sakshi
Sakshi News home page

నిన్నే నమ్ముకున్నాం సారూ.. మరొక్కమారు నాకు చాన్స్‌ ఇవ్వరూ ప్లీజ్‌..

Published Sat, Mar 9 2024 9:55 AM

- - Sakshi

అసమ్మతులు తానా.. అధిష్టానం తందానా

సీటుపై హామీ లేక ప్రభాకర్‌ చౌదరిలో అసహనం

జనసేనకు సీటు ఇస్తున్నట్టు టీడీపీలో ప్రచారం

సీటు ఇవ్వకపోతే రాజకీయ సన్యాసమే అంటున్న అనుచరవర్గం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత వైకుంఠం ప్రభాకర్‌చౌదరికి పార్టీ అధిష్టానం చుక్కలు చూపిస్తోంది. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన ఆయన 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీచేయాలని తీవ్రంగా యత్నిస్తున్న చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభాకర్‌ చౌదరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీకి కష్టపడిన తనకు ఈ దుస్థితి ఏమిటని కార్యకర్తల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు గనుక టికెట్‌ ఇవ్వకపోతే ప్రభాకర్‌ చౌదరి రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని అనుచరులు వాపోతున్నారు.

పరిగణనలోకి కూడా తీసుకోలేదు
గత రెండు మాసాలుగా టికెట్‌ కోసం యత్నిస్తున్న ప్రభాకర్‌ చౌదరికి ఏ దశలోనూ హామీ లభించలేదు. పైగా ఈయన్ను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అర్బన్‌ నియోజకవర్గంలో పాతిక వేలకు పైగా బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్టు అంచనా. దీంతో జనసేనకు ఇస్తే బావుంటుందనేది చంద్రబాబు ఆలోచన. 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో టీడీపీ కోసం కృషి చేస్తే ఉన్నట్టుండి జనసేనకు టికెట్‌ ఇస్తే తన పరిస్థితి ఏమిటని చౌదరి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గనుక టికెట్‌ తెచ్చుకోలేకపోతే రాజకీయ సన్యాసం తప్పదేమోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందని తెలుస్తోంది.

తేల్చుకునేందుకు విజయవాడకెళ్లిన చౌదరి
వాడుకుని వదిలేయడమంటే చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే. ఈ కోవలోనే బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్‌ లాంటి వాళ్లందరూ బలయ్యారు. తాజాగా ప్రభాకర్‌ చౌదరి వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు సొంత పార్టీలోనే ప్రభాకర్‌ చౌదరిని వ్యతిరేకించే వాళ్లు తానా అంటుంటే.. వీరికి వంతపాడుతూ అధిష్టానం తందానా అంటోంది.

జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు ప్రభాకర్‌ చౌదరిపై ఏదో ఒక రకంగా రోజూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు దీన్ని ఎదుర్కోలేక తంటాలు పడుతుంటే మరోవైపు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేదు. ఇప్పుడాయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ పరిస్థితి గందరగోళంగా ఉంది. పొత్తులో ఏ పార్టీకి సీటిస్తారో, ఎవరు అభ్యర్థో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రభాకర్‌ చౌదరి విజయవాడకు బయలుదేరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement