మహిళలకు చీరలు.. యువతకు డిన్నర్లు
దొడ్డిదారిన గెలవాలనే లక్ష్యంతో ఓటర్లకు గాలం
డబ్బు వేసేందుకు ఫోన్‌పే నంబర్లు సేకరిస్తున్న వైనం
టీడీపీ హయాంలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను చేర్చిన ఆయన.. ఇప్పటివరకూ జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆ ఓట్ల ద్వారానే గట్టెక్కారు. నమ్మి గెలిపించిన ప్రజలను వంచిస్తూ 30 ఏళ్ల పాటు అవినీతి, అక్రమాలు సాగించారు. ఆయన మోసాలను గ్రహించిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను గమనించిన ఆయన.. ప్రలోభాలకు తెరలేపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లకు వివిధ రూపాల్లో గాలం వేస్తున్నారు.
ఉరవకొండ: గారడీ మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటూ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న పయ్యావుల కేశవ్‌కు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉరవ కొండలో ఎన్నికలకు 40 రోజుల ముందుగానే ఆయన ప్రలోభాలకు తెరలేపడం ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. ఓటర్లను మభ్య పెట్టేందుకు తన బ్యాచ్ ద్వారా ఆయన శ్రీకారం చుట్టారు.
వివిధ రూపాల్లో గాలం
ఓటర్లను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో పలు రకాలుగా వారికి ఎమ్మెల్యే కేశవ్ గాలం వేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహిళలకు చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే, చాలా గ్రామాల్లో మహిళలు చీరలు వెనక్కి ఇస్తుండడంతో టీడీపీ నేతలు అయోమయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇక.. ఎమ్మెల్యే కేశవ్ సోదరుడు, టీడీపీ నేత పయ్యావుల శీనప్ప ఉరవకొండలో వివిధ కులసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ, ఆ మాటున వారికి డిన్నర్ల కోసమంటూ రూ.50 వేల వరకు అందిస్తున్నట్లు తెలిసింది.
త్వరలో డబ్బు ఫోన్ పే చేస్తారట..
ఎమ్మెల్యే కేశవ్ తన అనుచరులను నియోజకవర్గంలోని ఇంటింటికీ పంపి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉండే టీడీపీ నాయకులతో పాటు అనంతపురం నుంచి వచ్చిన కొత్త వ్యక్తులు ఓటరు జాబితాతో ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఎంత మంది ఉన్నారు తదితర వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ యజమాని ఫోన్‌పే, గూగూల్‌పే నంబర్లు అడిగి తీసుకుంటున్నారు. త్వరలో డబ్బు అందుతుందని వారిని మభ్యపెడుతున్నట్లు సమాచారం. ఇలాంటి అరాచకాలను చాలా చోట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుంటున్నా, దొంగచాటున కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
దొంగ ఓట్లతో గెలుపు..
పదవీ కాంక్షతో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చి నాలుగుసార్లు ఎన్నికల్లో కేశవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన పట్ల ప్రజలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా దొంగ ఓట్లతో గట్టెక్కుతూ వస్తున్నారు. అయితే, కేశవ్ మోసాన్ని గ్రహించిన ఉరవకొండ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి బోగస్ ఓట్లు తొలగించాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వేలాది ఓట్లను అధికారులు తొలగించారు. ఈ క్రమంలోనే డైలమాలో పడ్డ పయ్యావుల కేశవ్.. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు తెరతీశారు. అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని ఇంటింటికీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందడం, అదే మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ప్రజలు మరోసారి వైఎస్సార్ సీపీ పాలనను కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment