బాబుకు సంకటం.. నాలుగింటిపై పీటముడి | - | Sakshi
Sakshi News home page

బాబుకు సంకటం.. నాలుగింటిపై పీటముడి

Published Wed, Mar 6 2024 1:30 AM | Last Updated on Wed, Mar 6 2024 9:46 AM

- - Sakshi

ఉమ్మడి జిల్లాలో నాలుగు టీడీపీ టికెట్లపై ఎటూ తేల్చని చంద్రబాబు

కందికుంటకు డీడీల కేసులో శిక్షతో ఇరకాటం

అనంతపురం అర్బన్‌లో టీడీపీకి జనసేన పోటు

గుంతకల్లులో జితేందర్‌గౌడ్‌కు గుమ్మనూరు షాక్‌

ధర్మవరంలో డబ్బువైపే మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులెవరో చంద్రబాబు తేల్చలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరైన అభ్యర్థులు దొరక్క సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అసమ్మతులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అభ్యర్థులకు వ్యతిరేకంగా రోడ్లెక్కారు. చంద్రబాబు స్వయంగా నచ్చజెప్పినా వినడం లేదు. ఈ క్రమంలోనే మిగిలిన నాలుగు స్థానాల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కదిరి, ధర్మవరం, గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక బాబుకు తీవ్ర సంకటమే అయ్యిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పుట్టపర్తి టికెట్‌ కూడా ఇప్పటికీ ప్రకటించలేదు. కానీ ఇక్కడ పల్లె కుటుంబానికే టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

కందికుంటను వెంటాడుతున్న డీడీల కేసు
కదిరి నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో గెలిచి, 2019లో ఓడిపోయిన కందికుంట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఈ పరిస్థితుల్లో ఆయన పోటీచేసే అవకాశం లేదు. ఆయన భార్యకు టికెట్‌ ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయని బాబు భయపడుతున్నారు. కందికుంట మాత్రం తనదే టికెట్‌ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

ధర్మవరంలో సంకటం
ధర్మవరం సీటు కోసం కొన్ని నెలలుగా పరిటాల శ్రీరామ్‌ విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ వరదాపురం సూరి తనదే టికెట్‌ అంటున్నారు. ఇద్దరి మధ్యా కొన్ని రోజులుగా యుద్ధవాతావరణం నెలకొంది. వీరి వర్గీయులు పరస్పర దాడులకు సైతం తెగబడుతున్నారు. ఒకవిధంగా ధర్మవరంలో స్థానికులు పరిటాల, వరదాపురం వర్గాల దాడులు, ప్రతిదాడులతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

చౌదరికి జనసేన పోటు తప్పదా?
అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ టికెట్‌ ఈ సారి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే ప్రభాకర్‌ చౌదరికి ఇక రాజకీయ సన్యాసమే అంటున్నారు స్థానికులు. ఈ సీటులోనూ ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. పవన్‌కల్యాణ్‌ ఇక్కడ పోటీ చేస్తే తాను సీటు త్యాగం చేస్తానని చౌదరి అంటున్నారు. అసలు భీమవరం నుంచే పవన్‌కల్యాణ్‌ వెళ్లిపోగా..అనంతపురం ఎందుకొస్తారంటూ చౌదరిపై ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

జితేందర్‌కు గుమ్మనూరు పొగ!
గుంతకల్లులో సీనియర్‌ నేతగా ఉన్న జితేందర్‌ గౌడ్‌కు ఈసారి బాబు ఝలక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గుమ్మనూరు జయరాముకు టీడీపీ టికెట్‌ ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతోంది. గుమ్మనూరుకు టికెట్‌ ఇస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చంద్రబాబుకు అంతుచిక్కడం లేదు. దీంతో ఇక్కడ టికెట్‌ ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక పోతున్నారు. మరోవైపు రెండు ఎంపీ సీట్లమీద కూడా ఇప్పటికీ స్పష్టత రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement