ప్రగతి సాధకుడికా? అభివృద్ధి నిరోధకుడికా?
తాడిపత్రిలో ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి రూరల్: పోలింగ్‌కు 48గంటల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో తాడిపత్రి ప్రగతికి బాటలు వేసిన తనకా? లేకపోతే అభివృద్ధిని అడుగడునా అడ్డుకున్న టీడీపీకా? ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ఐదేళ్ల తాడిపత్రి భవిష్యత్తు ఓటర్లపై ఆధారపడి ఉందన్నారు. ఓటు వేసే సమయంలో ఏ మాత్రం పొరపాటు చేసిన దాని ప్రభావం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, తాడిపత్రి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తాడిపత్రిలో అభివృద్ధి, ప్రశాంతతకు పెద్దపీట వేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు విని ఆ పార్టీకి ఓటు వేస్తే అరాచకాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, మట్కా, పేకాట, అసాంఘిక శక్తులకు ఊతమిస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారే ప్రమాదముందన్నారు. 40 ఏళ్లుగా జేసీ కుటుంబ ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ఎదురైన పరిస్థితులను తాడిపత్రి ప్రజలు కళ్లారా చూశారన్నారు. జేసీ అరాచకాలకు చరమగీతం పాడుతూ 2019 ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, దీంతో ప్రజలు ఆశించినట్లుగానే తాడిపత్రి ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించానన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ అందజేశామన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద జేసీ కట్టించిన యూరినల్స్‌ను తొలగించి, వారి ఆత్మాభిమాన్ని నిలబెట్టానన్నారు. ఎన్నో ఏళ్లుగా ఏటా డిసెంబర్ నుంచి నెలన్నర పాటు మాలధారులకు అయ్యప్పస్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జేసీ అడ్డుకుంటే, ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత పునరుద్ధరించానన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై వేసే ప్రతి ఓటూ నేరుగా వైఎస్ జగన్‌కు చేరి అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు వేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment