వేగంగా మాయమవుతూ..
అనంతపురం అగ్రికల్చర్: పేరుకు వర్షాకాలమైనా భూగర్భజలాలు పెరగడం లేదు. మరో రెండు మూడు నెలలు ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భూగర్భజలశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. వాన నీరు ఎక్కడికక్కడ ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు విరివిగా డ్రిప్, స్ప్రింక్లర్లు వాడటం, చెక్‌డ్యాంలు, పర్క్యులేషన్ ట్యాంకులు, నీటి కుంటలు లాంటివి పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం, వరి లాంటి అధికంగా నీరు అవసరమయ్యే పంటలు కాకుండా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తే సమస్య నుంచి గట్టెక్కడానికి అవకాశముంటుందని చెబుతున్నారు.
13.14 మీటర్లుగా నమోదు..
జూన్ మొదటి 15 రోజుల్లో 145 మి.మీ మేర కురిసిన వర్షాలకు ప్రస్తుతం నీటిమట్టం స్థిరంగానే ఉంది. భూగర్భజలశాఖ 97 ఫిజోమీటర్ల నుంచి తాజాగా సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లా సగటు నీటిమట్టం 13.14 మీటర్లుగా నమోదైంది. పుట్లూరు మండలంలో గరిష్టంగా 24.78 మీటర్లకు భూగర్భ జలాలు పతనమైనట్లు వెల్లడైంది. 15 మీటర్లు దాటితే సమస్యలు ఉత్పన్నమవుతాయి. వర్షాకాలంలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగితేనే వచ్చే వేసవి నాటికి గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి సగటు నీటిమట్టం 8.22 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే నేడు 4.92 మీటర్లు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం 11 మండలాల్లో నీటి వినియోగం అధికంగా ఉండటంతో తగ్గుదల నమోదవుతోంది. ఈ మండలాల్లో 15 మీటర్లకు పైబడి లోతులో నీటి మట్టం రికార్డయింది. కేవలం ఒక మండలంలో మాత్రమే 3 మీటర్ల లోపు ఉండగా.. 9 మండలాల్లో 8 మీటర్ల లోపు, 10 మండలాల్లో 15 మీటర్ల లోపు భూగర్భజలాలు ఉన్నాయి. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం,డీ హీరేహాళ్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కణేకల్లు, కుందుర్పి, పుట్లూరు, రాయదుర్గం, శెట్టూరు, యాడికి మండలాల్లో నీటి వాడకం అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి నెల రోజులు కొనసాగితే బొమ్మనహాళ్, గుత్తి, కంబదూరు, పామిడి, నార్పల, తాడిపత్రి, యల్లనూరు మండలాల్లో కూడా బాగా తగ్గిపోయే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో చీనీతో పాటు ఇతర ఉద్యాన పంటలకు ఇబ్బందిగా మారడం ఖాయం. ఇప్పటికే పలు మండలాల్లో తాగు నీటి ఇబ్బందులు నెలకొనడం గమనార్హం.
గత ఐదేళ్లలో సమృద్ధిగా తాగు, సాగునీరు..
గత ఐదేళ్ల కాలంలో విస్తారంగా వర్షాలు పడటంతో జిల్లా అంతటా సమృద్ధిగా తాగు, సాగునీరు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా 2021, 2022లో కుండపోత వర్షాలు పడటంతో దశాబ్దాలుగా ఒట్టిపోయిన పెద్ద పెద్ద చెరువులు, నదీ పరివాహక ప్రాంతాలు సైతం జలసిరిని సంతరించుకున్నాయి. 2018లో భూగర్భజలాలు 25 మీటర్లుగా నమోదు కాగా 2019 అక్టోబర్ నాటికి 20 మీటర్లకు చేరుకున్నాయి. 2021, 2022లో అయితే సగటు నీటి మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా 6 నుంచి 7 మీటర్లకు చేరింది. పలు చోట్ల మోటార్లు లేకుండానే ఎండిపోయిన బోరుబావుల నుంచి నీళ్లు పైకి వచ్చాయి. అయితే, 2023–24 వర్షపు ఏడాదిలో వానల్లేక క్రమంగా నీటిమట్టం తగ్గుతూ ప్రస్తుతం సగటున 13.14 మీటర్లకు చేరుకుంది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాల ప్రభావంతో కురిసే వర్షాలపై భవిష్యత్తు ఆధారపడి ఉందని భూగర్భ జల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వర్షాకాలమైనా పెరగని
భూగర్భజలాలు
జిల్లాలో తాజా సగటు నీటిమట్టం
13.14 మీటర్లుగా నమోదు
పుట్లూరు మండలంలో గరిష్టంగా 24.78 మీటర్లకు పతనం
ఇదే పరిస్థితి కొనసాగితే
ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం
పలు మండలాల్లో
నీటి కష్టాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment