అనంతపురం: జిల్లాకు కృష్ణా జలాల రాక ఆలస్యం కావడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. హంద్రీ–నీవా గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1985లో హంద్రీ–నీవాకు ఓడీసీ వద్ద ఎన్‌టీఆర్ శంకుస్థాపన చేస్తే.. 1995లో చంద్రబాబు ఉరవకొండలో 40 టీఎంసీలుగా శంకుస్థాపన చేసి నాలుగేళ్లు ఏమీ చేయకుండా 1999లో దాన్ని 5 టీఎంసీలకు కుదించారని, అప్పట్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.
కనీసం ఫౌండేషన్ ఖర్చులు కూడా ఇవ్వలేని చరిత్ర బాబుదని ధ్వజమెత్తారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హంద్రీ–నీవా పనులు వేగవంతం చేశారన్నారు. అప్పట్లో తాను ఎంపీగా ఉన్నానని, 2005లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి నీరు తీసుకువచ్చామన్నారు. 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయని, అది మహానేత వైఎస్సార్ చలవేనన్నారు. హంద్రీ–నీవాను 3,850 క్యూసెక్కుల నుంచి 6వేలకు పెంచుతామని చెప్పి కనీసం గంపెడు మట్టి తీయని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
టీడీపీ పాలనలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కరువు విలయతాండవం ఆడడంతో వలసలు పెరిగాయన్నారు. రెయిన్‌గన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్లకు అధిపతి అయిన చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారన్నారు. 2019లో ఉమ్మడి అనంతపురంలో రెండు సీట్లు టీడీపీకి వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలో వస్తుందని పచ్చ పత్రికల్లో రాతలు రాసుకుని భ్రమల్లో బతుకుతున్నారన్నారు.
ఇవి చదవండి: విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరండి: సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment