మొదటి రోజు మందకొడిగా ప్రక్రియ
అనంతపురం పార్లమెంటు స్థానానికి ఇద్దరు నామినేషన్లు
గుంతకల్లు మినహా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు
అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు కాస్త మందకొడిగా సాగింది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి కేవలం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్‌ఓ వినోద్‌కుమార్ వద్ద సోషలిస్టు యూనిట్ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ అభ్యర్థిగా బి.నాగముత్యాలు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థిగా శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన శ్రీరంగరాజులు గోపినాథ్ నామినేషన్ వేశారు.
ఆ ఒక్క అసెంబ్లీ స్థానం మినహా..
- జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
- అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున ఆ పార్టీ నేతలు ఆర్‌ఓకు పత్రాలు అందజేశారు. ఎస్‌యూసీఐ (సీ) పార్టీ అభ్యర్థిగా డి.రాఘవేంద్ర నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
- తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
- ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు.
- శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు.
- రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సాకే రాజేష్‌కుమార్ నామినేషన్ వేశారు.
- రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం.బి. చిన్నప్పయ్య నామినేషన్ దాఖలు చేశారు.
- కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీరంగరాజుల గోపినాథ్ నామినేషన్ వేశారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తామని అనంతపురం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గురువారం ఆయన కలెక్టరేట్‌లోని ఆర్‌ఓ చాంబర్‌లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు ఉంటుందన్నారు. 26న పరిశీలన నిర్వహిస్తామన్నారు. ఉపసంహరణకు 29వ తేదీ ఆఖరన్నారు. ఎన్నికల పోలింగ్ మే 13న ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న నిర్వహిస్తామన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
నామినేషన్‌తో పాటు జత చేయాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించి చెక్‌లిస్ట్ ఇస్తారన్నారు. ఆ ప్రకారం పత్రాల్లోని అన్ని గడులు తప్పక పూరించాలన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచించారు. నామినేషన్ దాఖలు క్రమంలో ఏదైనా సందేహం వస్తే సిబ్బందిని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. నామినేషన్ల సందర్భంగా ఆర్‌ఓ కార్యాలయం వద్ద ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment