No Headline
ఉమ్మడి జిల్లాపై పాముల పగ
పాముకాట్లలో ‘అనంత’కు నాలుగో స్థానం
ఏటా సగటున 2,600 కేసుల నమోదు
బాధితుల్లో యువకులు, మధ్య వయస్కులే అధికం
23 శాతం మంది విషపూరిత పాముల కాటుకు గురి
పాములు మనుషులను బెంబేలెత్తిస్తున్నాయి. పాముకాటు బాధితుల సంఖ్య ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా పెరుగుతోంది. ఎక్కువగా వర్షాకాలంలో పాముకాట్లు నమోదవుతున్నాయి. ఏటా సగటున 2,600 మంది పాముకాటుకు గురవుతున్నారు. రాష్ట్రంలోనే పాముకాటు బాధితుల్లో ‘అనంత’ నాలుగో స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో ఎక్కువగా పొలం పనులకు వెళ్లే వారే పాము కాటుకు గురవుతున్నట్టు తాజా గణాంకాల్లో బయటపడింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అత్యంత విషపూరితమైన పాములుగా నాలుగు రకాల పాములను గుర్తించారు. వీటిలో నాగుపాము, కట్ల పాము, రక్త పింజరి, చిన్న పింజరి లేదా తోటి పింజరి పాములు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నమోదవుతున్న పాముకాటు కేసుల్లో 23 శాతం ఈ నాలుగు రకాల పాములకు సంబంధించినవేనని తేలింది. ఈ పాములు కాటేసిన 30 నిమిషాల్లో ప్రథమ చికిత్స చేయకపోతే ప్రాణాపాయం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నాలుగు రకాల పాములు స్వతహాగా కాటువేయడానికి ఆసక్తి చూపించవు. కానీ వాటిని తాకడం, తొక్కడం వంటివి చేసినప్పుడు బలంగా కాటు వేసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని నీటిపాములు, జెర్రిగొడ్లు వంటివి ప్రాణాపాయం కాదని, ప్రథమ చికిత్స చేస్తే వెంటనే కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
బాధితుల్లో యువకులే ఎక్కువ
పాముకాటుకు గురవుతున్న బాధితుల్లో ఎక్కువగా యువకులు, మధ్య వయస్కుల వారే ఉండటం గమనార్హం. పొలం పనులకు వెళ్లేవారిలో వీళ్లే ఎక్కువ. 21–30 ఏళ్ల వయస్కుల్లో 24 శాతం మంది బాధితులుండగా, 31–40 ఏళ్ల మధ్య వయసు వారు 24 శాతం మంది ఉన్నారు. 41–50 ఏళ్ల వారు 19 శాతం మంది పాముకాటు బాధితులు ఉన్నారు. పదేళ్లలోపు చిన్నారుల్లో 10 శాతం మంది ఉన్నారు. ఇదిలా ఉండగా పురుషులే ఎక్కువ మంది పాముకాటుకు గురవుతున్నారు. బాధితుల్లో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు ఉన్నారు.
రాత్రిపూటే పాముకాట్లు
పొలం పనులకు వెళ్లే రైతులు లేదా కూలీలు రాత్రి పూట అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న పాముకాట్లు 35 శాతానికి పైగా సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య జరుగుతున్నట్టు వెల్లడైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు 32 శాతం మేర కేసులు నమోదయ్యాయి. మిగతా కేసులన్నీ పగలు పూట నమోదైనవిగా గుర్తించారు. పాము కాటుకు గురైన బాధితులు 92 శాతం మంది 108 సర్వీసులోనే ఆస్పత్రులకు చేరారు. మొత్తం బాధితుల్లో 8 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా, మిగతా 92 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇదిలా ఉండగా గడిచిన రెండు మాసాల్లో పాముకాటుతో ముగ్గురు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment