గార్లదిన్నె: అధిక వడ్డీల కోసం మహిళను వేధిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ బాషా తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. కోటంక గ్రామానికి చెందిన కుళ్లాయమ్మ అనే మహిళ తన పెళ్లికి ముందు అనంతపురంలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తుండేది. రెండేళ్ల క్రితం అనంతపురంలోని రాణీనగర్‌కు చెందిన మణికుమార్ వద్ద అవసరాల నిమిత్తం వారానికి నూటికి రూ.10 వడ్డీతో రూ.1.50 లక్షలు అప్పు తీసుకుంది. తన బంగారు ఆభరణాలు అమ్మి అసలు, వడ్డీ కలిపి రూ.3లక్షలు చెల్లించింది. పెళ్లయిన తర్వాత భర్త సురేష్‌రెడ్డిని బెదిరించి అప్పు ఇంకా తీరలేదని గత ఏడాది జూలైలో రూ.5.30లక్షలకు ప్రాంసరీ నోటు రాయించుకున్నారు. అంతేకాదు బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకున్నారు. అప్పటి నుంచి డబ్బు కోసం వేధిస్తూనే ఉన్నారు. స్వగ్రామం కోటంకకు వెళ్లినా అక్కడకూ కొంతమంది మహిళలు వెళ్లి అప్పు తీర్చాలంటూ కుళ్లాయమ్మను బెదిరించారు. వడ్డీ వ్యాపారి మణికుమార్, అతని భార్య మణి, తల్లి కొత్తమ్మ నుంచి ప్రాణహాని ఉందని కుళ్లాయమ్మ గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ ముగ్గురిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment