23న గ్రూప్–2 మెయిన్స్
అనంతపురం అర్బన్: ‘‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈనెల 23న గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్షలు జరగనున్నాయి. 14 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 7,293 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్‌సీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షల నిర్వహణకు కోఆర్డినేటింగ్ అధికారిగా జేసీ ఉంటారన్నారు. ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారన్నారు. పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. 14 పరీక్ష కేంద్రాలకు 14 మంది జిల్లాస్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించామన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
జిల్లాలో మార్చి 1 నుంచి 20 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు డీఆర్‌ఓ కో–ఆర్డినేటింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. పరీక్షల ప్రశ్నపత్రాలు కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసు బందోబస్తు తప్పనిసరి అన్నారు. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది ఉండాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్‌ఎన్ షరీఫ్, సెక్షన్ ఆఫీసర్లు శంకర్రావు, ఆరోగ్యవాణి, నాగభవాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, డీఈఓ ప్రసాద్‌బాబు, డీవీఈఓ వెంకటరమణనాయక్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్, డీపీఓ నాగరాజునాయుడు, సీపీఓ అశోక్ కుమార్, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఎన్‌ఐసీ డైరెక్టర్ రవిశంకర్, ఉపాధి కల్పనాధికారి కల్యాణి, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఏడీ రజిత, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.
● బుక్కరాయసముద్రం మండల పరిధి రోటరీపురంలో ఉన్న గ్రూప్–2 పరీక్ష కేంద్రం ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలను గురువారం సాయంత్రం కలెక్టర్ సందర్శించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
14 కేంద్రాల వద్ద ఏర్పాట్లు
పకడ్బందీగా ఉండాలి
కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈనెల 23న జరగనున్న గ్రూప్–2 పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఏదేని సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 18004258804, 08554– 231722కు కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment