ఎన్నికలెప్పుడొచ్చినా కూటమికి ఓటమే
గుంతకల్లుటౌన్: ఎన్నికల హామీలను గాలికొదిలేసి ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన కూటమికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటమి తప్పదని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి జోస్యం చెప్పారు. శనివారం గుంతకల్లులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ఆయా రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. తాను సంపద సృష్టికర్తనని చెప్పుకునే చంద్రబాబు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుభరోసా, తల్లికి వందనం, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా నిధులివ్వడానికి ఆర్థిక ఇబ్బందులను సాకు చూపుతున్న చంద్రబాబు తమ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి మాత్రం పనిచేస్తున్నారని విమర్శించారు. సొంతింటి కల సాకారం చేయాలన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వ హయాంలో పేదలకు ఇంటి స్థలాలిస్తే కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్లు నిర్మించుకోలేదని, అలాంటి వారి స్థలాలను కూటమి సర్కారు రద్దు చేస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తోందని మండిపడ్డారు. బడులు, దేవాలయాల కంటే ముందే మద్యం షాపులను తెరిచి ఇష్టారాజ్యంగ సొంత బ్రాండ్‌లను విక్రయిస్తూ మద్యం ప్రియుల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ ఓ మహిళను హింసించి మోసం చేసినా.. ఆయనపై చర్యలు తీసుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తామన్నారు. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నుంచి గుంతకల్లు చేరుకున్న తనకు అపూర్వస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ వైవీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఖలీల్, రాము, కౌన్సిలర్లు లింగన్న, సుమోబాష, కోఆప్షన్‌సభ్యుడు ఫ్లయింగ్ మాబు, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ యుగంధర్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఎస్వీఆర్.మోహన్, సీనియర్ నాయకులు నూర్‌నిజామి, గోవింద్‌నాయక్, జయరామిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నియోజకవర్గం అధ్యక్షులు అబ్దుల్‌బాసిద్, వీరేష్, అంజి, షాబుద్దీన్, బాబూరావు పాల్గొన్నారు.
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు
Comments
Please login to add a commentAdd a comment