యూజీసీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: వైస్ చాన్సలర్ల నియామక నిబంధనలను పూర్తిగా మారుస్తూ కేంద్రం విడుదల చేసిన యూజీసీ డ్రాఫ్ట్ –2025 నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యావ్యవస్థలో ఊహించడానికి కూడా సాధ్యం కాని మార్పులను కేంద్రం తలపెట్టిందన్నారు. వాటిలో అత్యంత కీలకమైనవి వీసీ నియామకాలన్నారు. వీసీల ఎంపికకు సంబంధించి విద్యాపరమైన అర్హతలను సడలించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రైవేట్ రంగానికి చెందిన వారితో పాటు ఎలాంటి అకడమిక్ అనుభవం లేని వారిని కూడా వైస్ చాన్సలర్లుగా నియమించే అవకాశం ఉందన్నారు. సెర్చ్ కమిటీలు, అధ్యయనాల పరిశీలనలు కూడా ఉండవన్నారు. గవర్నర్ ఆధ్వర్యంలోనే కీలకమైన టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన నియామకాలు జరుగుతాయన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో యూనివర్సిటీలను పెడితే విద్యా వ్యవస్థ కుంటుపడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఆర్టికల్ 66 ప్రకారం ఉన్నత విద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు మధ్య సమన్వయం చేయడానికి ప్రమాణాలను నిర్దేశించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని గుర్తు చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు కై లాష్, నాయకులు వెంకట్, బోయ నితిన్, రాహుల్ రెడ్డి, బోయ శ్రీనివాస్, శివ, శారిక్, సూర్య రెడ్డి, సురేష్, సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment