ఎన్నికల విభాగం... అంతా మా ఇష్టం!
అనంతపురం అర్బన్: జిల్లా ఎన్నికల విభాగం అవకతవకలకు కేంద్రంగా మారింది. ఎన్నికల నిధులను ఇష్టారాజ్యంగా పంచడం.. విజయవాడలోని ప్రధాన ఎన్నికల కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేస్తుండటం... అక్రమాలకు పాల్పడి సరెండర్ అయిన ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు సపోర్ట్ చేయడంతదితర వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
యథేచ్ఛగా చెల్లింపులు..
2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు విడతలవారీగా కోట్ల రూపాయల నిధులను అప్పట్లోనే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలోనే బూత్ లెవల్ అధికారులకు రెమ్యునరేషన్ చెల్లింపులో ఎన్నికల విభాగం అధికారులు వివాదానికి తెరతీసినట్లు తెలిసింది. జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికానికి సంబంధించి 3,750 మంది బీఎల్‌ఓలకు రూ.750 చొప్పున, నాల్గో త్రైమాసికానికి రూ.1,500 చొప్పున రూ.84,37,500 చెల్లించాల్సి ఉంది. అలాగే 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలకు కలిపి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున 2,198 మందికి రూ. 1.31 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంఽధించి మూడు త్రైమాసికాలకు కలిపి ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున రూ.99,58,500 చెల్లించాలి. 2021–22లో బీఎల్‌ఓలుగా పనిచేసిన వారిలో కొందరు 2022–23, 2023–24లో ఆ విధులు నిర్వర్తించలేదు. కానీ, 2021–22లో బీఎల్‌ఓలుగా పనిచేసిన వారిలో చాలా మందికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్నవారికే ఇష్టారాజ్యంగా చెల్లించినట్లు తెలిసింది.
డబ్బుల వసూలు..
ఎన్నికల విధుల్లో భాగంగా విజయవాడలోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి నివేదికలు తీసుకుని జిల్లా ఎన్నికల విభాగానికి సంబంధించి ఉద్యోగులు వెళతారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఒక ఉద్యోగి వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ వెళ్లే ప్రతిసారీ డీటీల నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తారని సమాచారం. డబ్బు ఇవ్వకపోతే ‘మీరే వెళ్లండని’ అంటుండడంతో చేసేదిలేక సమర్పించుకున్నట్లు తెలిసింది.
అక్రమార్కుడికి సపోర్ట్..
గత ఎన్నికల సమయంలో ఓటర్ల తొలగింపునకు (ఫారం–7) సంబంధించి రాప్తాడుకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) అవకతవకలకు పాల్పడటంతో అతడిని అప్పట్లోనే సరెండర్ చేశారు. అయితే ఆ ఉద్యోగిని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుమతి లేకుండానే కలెక్టరేట్‌లో నియమించుకున్నారు. వ్యవహారం బయటికి రావడంతో ఇటీవల పంపించేశారు. అక్రమాలకు పాల్పడిన సదరు ఉద్యోగికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు ఒకరు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. డీఈఓ చేసిన తప్పును వదిలేసి... ఆ విషయాన్ని బయటికి ఎవరు చెప్పారు అంటూ సదరు నాయకుడు అందరినీ బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఎన్నికల విభాగంలో నడుస్తున్న అడ్డగోలు వ్యవహారాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.
జేసీ అంతర్గత విచారణ..
ఎన్నికల నిధుల దుర్వినియోగంపై జేసీ శివ్ నారాయణ్ శర్మ అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం. అప్పట్లో నియోజకవర్గాల ఈడీటీలు(ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు) గా విధులు నిర్వర్తించిన వారిని జాయింట్ కలెక్టర్ నాలుగు రోజుల క్రితం పిలిపించి విచారణ చేసినట్ల్లు తెలిసింది. దీనిపై ఆయన సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి త్వరలో సమర్పించనున్నారు.
ఎన్నికల నిధుల దుర్వినియోగం
ఇష్టారాజ్యంగా బీఎల్‌ఓలకు రెమ్యునరేషన్
విజయవాడ వెళ్లినప్పుడల్లా ఓ ఉద్యోగి డబ్బు వసూలు
సరెండెర్ డీఈఓకి సంఘం నాయకుడు సపోర్ట్
తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న అధికారుల వ్యవహారాలు
ప్రత్యేక దృష్టి సారిస్తా
ఎన్నికల విభాగం వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా. బీఎల్‌ఓలకు రెమ్యునరేషన్ చెల్లింపులను పరిశీలిస్తా. ఎన్నికల విధులు నిర్వర్తించిన ప్రతి బీఎల్‌ఓకు రెమ్యునరేషన్ అందేలా చర్యలు తీసుకుంటా.
– వి.వినోద్‌కుమార్, కలెక్టర్
ఎన్నికల విభాగం... అంతా మా ఇష్టం!
Comments
Please login to add a commentAdd a comment