సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం
అనంతపురం: అనంతపురానికి సమీపంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో కలకలం రేగింది. తమ బాత్‌రూముల్లోకి, గదుల్లోకి అక్కడే పనిచేస్తున్న బిహార్ యువకులు తొంగి చూస్తున్నారని, తమకు రక్షణ కరువైందంటూ క్యాంపస్ విద్యార్థినులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మహిళా హాస్టల్ బాత్‌రూముల్లోకి ఒకరు తొంగిచూసినట్లు నీడ కనపడింది. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని కేకలు వేయడంతో అగంతకుడు పారిపోయాడు. వాష్‌రూం బయట గల సన్‌సైడ్‌కు వెళ్లేందుకు వీలుగా ఉన్న గేటును సైతం తొలగించి.. అక్కడి నుంచి తొంగిచూస్తున్నట్లు నీడ కనపడింది. వాష్‌రూంలో సైతం తమకు భద్రత కరువైందని విద్యార్థినులు వాపోతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన మొదలుపెట్టిన విద్యార్థినులు ..రాత్రి 12 గంటలైనా కొనసాగించారు. దీంతో సెంట్రల్ వర్సిటీ అట్టుడికిపోతోంది. సుమారు వేయి మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు.
గత డిసెంబర్ 9వ తేదీ ఇలాగే..
గతేడాది డిసెంబర్ 9వ తేదీన అర్ధరాత్రి కూడా వర్సిటీ భవన నిర్మాణ పనులు చేస్తున్న బిహార్‌కు చెందిన కొందరు యువకులు.. అమ్మాయిల స్నానాల గదులున్న వైపు తొంగి చూసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ సమయంలో విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడంతో సదరు వ్యక్తులు పారిపోయారు. భయంతో వణికిపోయిన విద్యార్థినులు డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు వర్సిటీకి చేరుకుని విచారణ చేశారు. అనుమానితులైన నలు గురు బిహార్ యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. తాజాగా అదే ఘటన పునరావృతం కావడంతో విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇలా ఎన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ గడపాలని ప్రశ్నిస్తున్నారు.
రక్షణ కరువైందంటూ
విద్యార్థుల ఆందోళన
సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం
Comments
Please login to add a commentAdd a comment