కదం తొక్కిన అంగన్‌వాడీలు
అనంతపురం సెంట్రల్: తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు కదం తొక్కారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనంతపురం శారదానగర్‌లోని ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్‌హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీల జీతాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అంశాన్నీ యాప్‌లలో చేయమని చెబుతుండటంతో అంగన్‌వాడీలపై తీవ్ర పనిభారం పడుతోందని వాపోయారు. మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్చడంతో పాటు వర్కర్‌లకు సెలవులు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 26 వేలు అందించాలని కోరారు. హెల్పర్ పదోన్నతులకు నిర్దిష్ట గైడ్‌లైన్స్ రూపొందించాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారి దహన సంస్కారాలకు రూ. 20 వేలతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అద్దెలు, టీఏ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, 164 సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ రూరల్ ప్రాజెక్టు అధ్యక్షురాలు అరుణ, అర్బన్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నక్షత్ర, రేవతి, సీఐటీయూ నగర కార్యదర్శి ముత్తూజ, సీఐటీయూ ఉపాధ్యక్షులు రామాంజనేయులు, పలువురు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
సర్కారు తీరుపై కన్నెర్ర
జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరసన
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్
కదం తొక్కిన అంగన్‌వాడీలు
Comments
Please login to add a commentAdd a comment