విద్యార్థినుల భద్రతకు చర్యలు
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్ తెలిపారు. సోమవారం రాత్రి సెంట్రల్ యూనివర్సిటీని కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులతో వేర్వేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల హాస్టల్ వద్ద సెక్యూరిటీని యూనివర్సిటీ వారు ఏర్పాటు చేయాలన్నారు.వర్సిటీలో స్టూడెంట్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి వారం తహసీల్దార్ పుణ్యవతి యూనివర్సిటీని తనిఖీ చేస్తారన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటుపై వర్సిటీ ఉన్నతాధికారులకు సూచనలు చేశామని, తాము కూడా బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కోరి, ఆర్డీఓ కేశవ నాయుడు, సీఐ కరుణాకర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వే పక్కాగా నిర్వహించాలి
గుమ్మఘట్ట/బ్రహ్మసముద్రం: భూముల రీ సర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాల్లో జరుగుతున్న రీ సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే చేస్తున్న సమయంలో రైతులకు నోటీసులు ఇవ్వాలన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాల్లో పలు రికార్డులు పరిశీలించారు. బీటీ ప్రాజెక్టును సందర్శించి ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరందించారని జలవనరులశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్లు శ్రీని వాసులు, సుమతి తదితరులు పాల్గొన్నారు.
జీతాలు చెల్లించమని
కోరితే షోకాజ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు సక్రమంగా చెల్లించమని విజ్ఞప్తి చేసిన బోధనేతర ఉద్యోగుల సంఘం నాయకుడు రఘోత్తం రెడ్డిపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. జీతాల చెల్లింపులో రిజిస్ట్రార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొంటూ గత గురువారం రఘోత్తం రెడ్డి బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి, విద్యాశాఖ మంత్రిపై లేఖలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంలో రిజిస్ట్రార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మాత్రమే లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రఘోత్తం రెడ్డికి సోమవారం రిజిస్ట్రార్ రమేష్ బాబు షోకాజ్ నోటీసు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 25వ తేదీ లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించారు. సమస్య పరిష్కరించాల్సింది పోయి ఇలా కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని బోధనేతర ఉద్యోగులు పేర్కొంటున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం
గుమ్మఘట్ట: మండలంలోని కలుగోడు గ్రామంలో రంజిత్‌కుమార్ (23) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి, తిప్పమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు రంజిత్‌కుమార్ బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత శనివారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి రంజిత్‌కుమార్ వచ్చాడు.ఏమైందో తెలియదు కానీ, సోమవారం తమ ఇంటి పక్కనే ఉన్న గంగన్న గౌడ ఇంట్లో పైకప్పునకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంతో చలాకీగా ఉండే రంజిత్‌కుమార్ మృతితో గ్రామస్తులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగారు.
విద్యార్థినుల భద్రతకు చర్యలు
విద్యార్థినుల భద్రతకు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment